రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రేఖ రాసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 నిర్మాతలకు మాత్రమే అనుకూలంగా ఏకపక్ష నిర్ణయంలా ఉందని అసోసియేషన్ ఆరోపించింది. సినీ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, టికెట్ ధరలు పెంచడం వల్ల ఎగ్జిబిటర్లకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, టికెట్ ధరల పరిధుల్లో అస్పష్టత, గందరగోళం నెలకొని ఉందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొన్నది.
ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ రాష్ట్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. వసతుల ఆధారంగా సినిమా థియేటర్లను వివిధ కేటగిరీల్లా విభజించడమే కాక, భారీ బడ్జెట్ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి కూడా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాలపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 33 జిల్లాలలో 400లకు పైగా సింగిల్ స్క్రిన్ థియేటర్లు ఉన్నాయి. వారందరినీ సంప్రదించకుండా, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా కేవలం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, పలువురు నిర్మాతల కోసం జీవోను ఎలా విడుదల చేస్తారని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లేఖలో ప్రశ్నించింది.
‘తాజా జీవోలో ఎయిర్ కూల్డ్ థియేటర్లన్నింటినీ ఏసీ థియేటర్లుగా మార్చాలనే నిబంధన ఉన్నది. ఇది ముమ్మాటికీ ఏకపక్ష నిర్ణయమే. చిన్న చిన్న పట్టణాల్లో ఎయిర్ కూల్డ్ థియేటర్స్‌ని ఏసీగా మార్చాలంటే దాదాపుగా 80లక్షలు ఖర్చవుతుంది. ఈ ఖర్చును భరించలేకపోవడం వల్ల థియేటర్లు మూత పడుతున్నాయి. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఏసీ చార్జీలు కూడా పెంచాలని గతంలోనే కోరాం. జీవో 77ను సవరించి మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా పెంచాలి. మల్టీఫ్లెక్స్‌లకు ఇచ్చే ఆదాయంలో న్యాయమైన వాటా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా ఇవ్వాలి. వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకొని జీవోను సవరించాలి’ అని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ లేఖలో కోరింది.