Emraan Hashmi | బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ స్వైన్ ఫ్లూ (H1N1) బారిన పడ్డారు. ఇటీవల రాంచీతో పాటు పలు ప్రాంతాల్లో వృత్తిపరమైన పర్యటనలు ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చిన ఆయన, కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలిందని వైద్య వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇక ఆరోగ్యం బాగాలేకపోవడంతో బెంగళూరులో జరగాల్సిన తన ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇమ్రాన్ హష్మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ క్షమాపణలు కోరారు. మరోవైపు ఆయన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయంతో దూసుకుపోతోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో విశేష్ భట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిశా పటాని, షబానా అజ్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.