Amma Naaku Aa Abbayi Kaavali | వైద్యో నారాయణో హరిః అంటారు. రోగాలతో బాధపడేవారికి ప్రాణం పోసే దైవంగా వైద్యులను కొలుస్తాం. అయితే, ప్రాణాలు కాపాడే ఆ తెల్ల కోటును ధరిస్తూనే, మరోవైపు వెండితెరపై తన అభినయంతో ప్రేక్షకులను అలరించేందుకు ఒక యువ వైద్యుడు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. లండన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తూనే సినిమా రంగంపై ఉన్న మక్కువతో హీరోగా అరంగేట్రం చేస్తున్న పవన్ మహావీర్ కథ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి రాజీ పడకుండా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే నెల ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ దర్శకులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ప్రముఖ దర్శకులు సి. రాంప్రసాద్, శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన అతిథులు మాట్లాడుతూ, పవన్ మహావీర్‌కు ఇదే తొలి సినిమా అంటే నమ్మడం కష్టమని, ఆయన నటనలో అనుభవశూన్యత అసలు కనిపించలేదని ప్రశంసించారు. నిర్మాత శైలజ రెడ్డి అభిరుచిని, దర్శకుడు శివాల ప్రభాకర్ టేకింగ్‌ను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ చిత్రంలో పవన్ మహావీర్ సరసన వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు.
ఈ వేడుకలో నిర్మాత జి. శైలజ రెడ్డి మాట్లాడుతూ.. “మా అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రాన్ని ఎంతో కష్టపడి, ప్రేక్షకులకు నచ్చేలా అద్భుతంగా రూపొందించాము. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి సహకరించిన సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్క నటీనటుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం, అందరూ ఆదరించాలి” అని కోరారు.
హీరో పవన్ మహావీర్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. “డాక్టర్ గా వైద్యం అందించడం ఎంత పవిత్రమో, హీరోగా వినోదం పంచడం కూడా అంతే సంతోషకరమైన విషయం. ఈ రెండు లక్ష్యాలను సాధించాలనే నా సంకల్పం నిజం కావడానికి కారకురాలైన దేవతలాంటి మా అమ్మకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రం కోసం మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆగస్టు 7న మీ ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ఆదరించి, భవిష్యత్తులో మా నుంచి మరిన్ని మంచి చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
దర్శకుడు శివాల ప్రభాకర్ మాట్లాడుతూ, తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు వర్షిక, సుహానా మాట్లాడుతూ, సినిమా విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, సక్సెస్ మీట్లో మళ్లీ కలుస్తామని ఉత్సాహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, ఫైట్స్: నందు, కొరియోగ్రఫీ: భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, కో-డైరెక్టర్: రావుశ్రీ, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కిషోర్, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్, నిర్మాత: జి. శైలజ రెడ్డి వ్యవహరిస్తున్నారు.