సమాజంలోని సున్నితమైన సమస్యలను, నిత్యం నిర్లక్ష్యానికి గురయ్యే వర్గాల కష్టాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా, ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాల ఆధారంగా ఆయన తెరకెక్కించిన శక్తివంతమైన కోర్ట్‌రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్” ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి అనూహ్య ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ప్రతిష్టాత్మకమైన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర బృందాన్ని అభినందిస్తూ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డికి, సీనియర్ నటుడు ఎల్. బి. శ్రీరామ్‌కు ఘనంగా పూలబొకేలను అందజేశారు. ప్రముఖ వ్యాఖ్యాత వల్లూరి రాఘవరావు తన సమయస్ఫూర్తితో కూడిన మాటలతో ప్రతి పాత్ర విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నడిపించారు.
ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 12వ కార్యక్రమమని, సునీల్ కుమార్ రెడ్డితో అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఈ సినిమా గురించి తెలుసుకుని, ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆత్మనూనతకు, ఆత్మగౌరవానికి మధ్య నలిగిపోతున్న జీవితాల యథార్థ రూపామే ఈ కథ అని, ఇందులో నటించిన నటీనటులందరికీ అభినందనలు తెలుపుతూ ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రసాదరావు సురేష్ కొండేటి మాట్లాడుతూ, టైటిల్ పరంగా ఉన్న సందేహాలను గుర్తుచేస్తూ, ‘ఎల్.జి.బి.టి.’ అనేది కేవలం తెలుగు సరిహద్దులకే కాక పాన్ ఇండియా స్థాయిలో కనెక్ట్ అయ్యే కథ అని కొనియాడారు. నేటి రోజుల్లో ఒకే థియేటర్లో 30 రోజుల పాటు సినిమా ఆడటం సామాన్య విషయం కాదని, ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఈ చిత్రానికి అనేక అవార్డులు రావాలని కోరారు.
వేదికపై భావోద్వేగానికి గురైన ముకుంద అనే మాతృమూర్తి మాట్లాడుతూ, ఒక ట్రాన్స్జండర్ మహిళకు తల్లిగా ఇలాంటి వేదికపై మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. సమాజంలో వీరి కష్టాలను, వీరు పడే అవమానాలను ఎవరూ పట్టించుకోరని, స్కూల్ స్థాయి నుంచే తీవ్ర మానసిక క్షోభను అనుభవించి చివరకు వ్యవస్థగా ఏర్పడి తమ ఉనికిని కాపాడుకుంటున్నారని వివరించారు. తన బిడ్డ నేడు విదేశాల్లో సైంటిస్ట్‌గా పనిచేస్తోందని, ఒకప్పుడు తానే ఇంటి నుంచి పంపించేసానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని పాఠశాలల్లో పిల్లలకు చూపిస్తే సమాజంలో ఎంతో మార్పు, అవగాహన వస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యంగా తోడు నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే 2007 బ్యాచ్‌కి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ దాసు మాట్లాడుతూ, తెలంగాణవ్యాప్తంగా ఈ కమ్యూనిటీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, సమాజంలో 99 శాతం మందికి వీరిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే వారు ఉపాధి లేక ఇతర మార్గాల్లోకి వెళ్తున్నారని, సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ వాస్తవాలను అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించారని కొనియాడారు.
సీనియర్ నటుడు ఎల్. బి. శ్రీరామ్ ఈ వేదికపై ఎంతో భావోద్వేగంగా మాట్లాడుతూ, పరిశ్రమ ఇంతటి ప్రతిభావంతుడైన దర్శకుడిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదో అనిపిస్తోందని, ఆయనను ఆలస్యంగా గుర్తించడం కొంత అవమానకరంగా భావిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిజాన్ని పక్కన పెట్టి సినిమాలు తీస్తూ ఆర్థికంగా దెబ్బతిన్నా, సమాజంపై బాధ్యతతో సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు తీస్తున్నారని ప్రశంసించారు. సినిమాలో తాను జడ్జి పాత్ర పోషించానని, న్యాయదేవత కళ్లకు గంతలు ఉన్నట్లే తన పాత్రకు కూడా గంతలు కట్టి విని తీర్పు చెప్పే కోణాన్ని అద్భుతంగా డిజైన్ చేశారని తెలిపారు. ఈ సినిమా ద్వారా ట్రాన్స్జండర్ల ఆచారాలు, వారి జీవితాల వెనుక ఉన్న నిజాలు తనకు తెలిసాయని, పరిశ్రమ ఈ దర్శకుడిని అత్యున్నత స్థాయిలో గుర్తించాలని కోరారు. అలాగే తెలంగాణ ట్రాన్స్ జండర్ ప్రెసిడెంట్ లైలా ఓరుగంటి మాట్లాడుతూ, తమ కమ్యూనిటీ పడుతున్న ఇబ్బందులను, న్యాయస్థానాల తీర్పులను కళ్లకు కట్టినట్లు చూపించడమే కాకుండా, స్వయంగా తమతోనే నటింపజేసిన ఘనత దర్శకుడికే దక్కుతుందని కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ, మొదట్లో 20 మంది ట్రాన్స్జండర్స్తో కలిసి నటించాలా అని కొంత సంకోచించినప్పటికీ, వారితో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఈ రోజుల్లో పెద్ద సినిమాలు కూడా వారం రోజులు ఆడటం కష్టంగా ఉన్న తరుణంలో ఈ చిత్రం 30 రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని, థియేటర్లలో ప్రేక్షకులు ఎమోషనల్ అవ్వడం, బయటకు వచ్చాక తనను పట్టుకుని ఏడవడం నటుడిగా తనకు దక్కిన అతిపెద్ద గుర్తింపు అని చెప్పారు. మరో నటుడు విష్ణు తేజ మాట్లాడుతూ, 2018 నుండి హక్కుల కోసం పోరాడుతున్న తమకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు వచ్చిన కొన్ని సినిమాల్లో తమను తక్కువ చేసి చూపించారని, కానీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఎంతో నిజాయితీగా, కుటుంబ వ్యవస్థ ఒత్తిళ్లు మరియు గే కమ్యూనిటీ సమస్యలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని గుర్తుచేశారు. నటి సనాఖాన్ కూడా మాట్లాడూతూ, సమాజంలో మార్పు రావడానికి ఇలాంటి చిత్రాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు.
చివరగా చిత్ర దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు, ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశ్వవిద్యాలయాల స్థాయిలో కూడా ఈ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్స్ కోసం అడుగుతుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి ఇంకా చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని వెల్లడిస్తూ, ప్రేక్షకులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ‘ఎల్ జి బీ టీ’ చిత్రానికి సీక్వెల్‌గా సెకండ్ పార్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇప్పుడే సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా ముగిసింది. ఈ వేడుకలో ప్రెసిడెంట్, సెక్రటరీలతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మామిడాల గిరిధర్, చందూ రమేష్, నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ కుమారస్వామి, సీనియర్ జర్నలిస్టులు పర్వీన్ బాబి, లక్ష్మణరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.