ప్రేక్షకులకు నచ్చే ఫార్ములా సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు మారుతి. గోపీచంద్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీఖన్నా నాయికగా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు మారుతి.
సినిమా పేరే ‘పక్కా కమర్షియల్’ అని పెట్టారెందుకు?
మీరు సినిమా చూశాక కమర్షియల్‌గా ఉందని అంటారు. ‘పక్కా కమర్షియల్’ అని ముందే చెప్పేస్తే సినిమా ఏ తరహానో అందరికీ స్పష్టత వస్తుంది. ఇందులో నేను స్పెషల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు, హీరో బిల్డప్ సీన్స్ చేయొచ్చు. లాజిక్స్ అన్నీ వదిలేసే సృజనాత్మక స్వేచ్ఛ దక్కుతుంది. పక్కా కమర్షియల్ అని వాళ్లే చెప్పుకున్నారు అంటారు. కమర్షియల్ సినిమాకు ఒక ఫార్మేట్ ఉండదు. నా హీరో వెయ్యి మంది రౌడీలను కొట్టొచ్చు, పైనుంచి వెళ్లే విమానాన్ని కిందకు లాగేయొచ్చు, పారాచ్యూట్‌తో ట్రైన్ మీద దూకొచ్చు. ఇలాంటి కథల్లో ఏదైనా చేసే వీలుంటుంది.
ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ మిమ్మల్ని ఈవీవీతో పోల్చారు
ఈవీవీ సినిమాల్లో పాట వచ్చినప్పుడు హీరో కొత్త డ్రెస్ మార్చు అంటాడు. ఇది కథలో నుంచి బయటకొచ్చి ప్రేక్షకుడితో మాట్లాడటం. నా సినిమాలోనూ అలాంటివి పెడుతుంటాను. ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో హీరోయిన్‌తో ఈ తరహా డైలాగ్స్ పెట్టాము. సీరియస్‌గా సాగుతున్న సినిమాలో ఇలాంటి పంచ్‌లు వేయడం సాధ్యం కాదు. ఇంటర్వెల్లో ఆట మొదలైంది అని కార్డ్ వేస్తారు. అంటే కథ తొలిభాగం ఏదీ లేదని మనమే ఒప్పుకున్నట్లు.
ఈ కథ ఎలా ఉండబోతున్నది?
రివేంజ్ కథతో సినిమా సాగుతుంది. అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఓ వెరైటీ లీగల్ పాయింట్‌ను చూపిస్తున్నాం. హీరో గోపీచంద్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుంది. అది వినోదాన్ని అందించేలా ఉంటుంది, బాధ పెట్టదు. ఈ సినిమాతో గోపీచంద్‌కు మంచి పేరొస్తుంది. అది ఆయనా, మేమూ నమ్ముతున్నాం. ప్రేక్షకులు ఇచ్చే ఫలితం కోసం వేచి చూస్తున్నాం.
మీ సినిమాల్లో నటీనటులు రిపీట్ అవుతుంటారు ఎందుకని?
ఈ కథలోనూ వాళ్లకు సరిపోయే పాత్రలున్నాయి. అందుకే రావు రమేష్, సత్యరాజ్ లాంటి వాళ్లను పెట్టుకున్నాం. మన దగ్గర ప్రతిభ గల నటీనటులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు సరైన పాత్రలు రాయగలిగితే మనకు పరభాషా నటీనటులతో అవసరమే ఉండదు. మన వాళ్లకు మన భాష, యాసలు తెలుసు, డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పించుకునే ఇతర భాషల నటులకు మన భాష, భావోద్వేగాలు ఎలా అర్థమవుతాయి.
ఫిల్మ్ మేకింగ్‌లో మీ దృక్పథం ఎలా ఉంటుంది?
ఒక ప్రేక్షకుడిగా ఆలోచించిన వారే మంచి దర్శకుడు కాగలరని నా నమ్మకం. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఎక్కడ విసుక్కుంటున్నారు. ఎక్కడ ఈలలు వేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రతిభతో పాటు ఇలాంటి పరిశీలనా ముఖ్యమే. నేను గతంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో పనిచేయడం కూడా దర్శకుడిగా నా అవగాహన పెంచింది. ఏ తరహా సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారని తెలుసుకున్నా. కమర్షియల్ అంశాలతో బడ్జెట్లో సినిమా రూపొందించడం అలవాటు చేసుకున్నా.
మీరు ఫార్ములా సినిమాలు చేయడానికి కారణమేంటి?
ఏ దర్శకుడైనా ప్రేక్షకుల కోసం సినిమాలు చేయాలి. నాకు నచ్చింది చేస్తా అంటే అది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. దీని వల్ల డబ్బు పెట్టిన నిర్మాత నష్టపోతాడు, ప్రేక్షకులూ తిరస్కరిస్తారు. అప్పుడు మరొకరి మీద నిందలు వేస్తారు. సినిమా కళాత్మక వ్యాపారం. అందరూ బాగుండాలంటే కమర్షియల్ ఫార్ములా సినిమాలే తెరకెక్కించాలి. కొందరు దర్శకులు అడ్వాన్డ్స్ సినిమా చేశాం, ప్రేక్షకులకు అర్థం కాలేదంటారు. ఎవరికీ అర్థం కాని సినిమాలు చేసి ఉపయోగం ఏంటి. డబ్బులు రాకుంటే మన శ్రమంతా వృథానే.
తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా చేయడం మీకెలా సాధ్యమవుతోంది?
పక్కా స్క్రిప్ట్ తయారు చేసుకుంటే నిర్మాణ వ్యయం, రోజులు తగ్గించుకోవచ్చు. కొంత బద్దకంతో ఎడిటింగ్ టేబుల్ మీద తగ్గిద్దాం అనుకుంటే కథలో లోపాలు, వ్యర్థాలు ఉన్నాయని ఒప్పుకున్నట్లే. మరో నెల రోజులు సమయం తీసుకున్నా కథ పకడ్బందీగా చేసుకుంటే షూటింగ్ ఖర్చు తగ్గించుకోవచ్చు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా టాకీ పార్ట్ 37 రోజుల్లో 2.61 కోట్ల రూపాయల ఖర్చుతో చేశాం. పారితోషికాలు, ప్రచార ఖర్చులు అంతా కలిపి 7 కోట్ల దాకా అయ్యింది. ఐదారుసార్లు కథను సరిచేసుకుంటే స్క్రిప్ట్ బలంగా తయారవుతుంది.
గతంలో కంటే ఇప్పుడు దర్శకుల మీద ఒత్తిడి పెరిగిందని అనుకోవచ్చా?
ఖచ్చితంగా ప్రస్తుతం దర్శకుల మీద ఒత్తిడితో పాటు బాధ్యత కూడా పెరిగింది. ఓటీటీలు వచ్చాయి. కావాల్సినన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చేతిలో సెల్‌ఫోన్ ప్రతి నిమిషం మోగుతుంది. వీటి నుంచి అతని దృష్టి మరల్చకుండా సినిమాలో లీనం చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మంచి సినిమా చేస్తేనే ప్రేక్షకులను, నిర్మాతను కాపాడుకున్న వాళ్లమవుతాం.
మీతో సినిమా చేస్తానని వేదిక మీద చిరంజీవి చెప్పినప్పుడు ఫీలింగ్ ఏంటి?
చిరంజీవి లాంటి పెద్ద హీరో నా దర్శకత్వంలో నటించడం అనేది ఇండస్ట్రీలో యువ దర్శకులకు ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. మనం మంచి చిత్రాలు చేస్తే స్టార్స్‌తోనూ అవకాశాలు వస్తాయని నమ్మకం కుదురుతుంది. యూవీ క్రియేషన్స్‌లో చిరంజీవి గారితో సినిమా చేయాలని గతంలో మాట్లాడుకున్నాం. ఆయనను తెరపై ఎలా చూపిస్తే ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేస్తారో నాకు అవగాహన ఉంది. అలాంటి కథతోనే సినిమా చేయబోతున్నా. ఇప్పటికే కథ లైన్‌గా చెప్పాను. బాగుందన్నారు. ఆయన డేట్స్ చూసుకుని సినిమా ప్రారంభిస్తాం.
ప్రభాస్‌తో మీరు చేసే సినిమాపై బయట చాలా టాక్ నడుస్తోంది..?
అవును పేరు పెట్టారు, సినిమా జానర్ చెప్పేశారు, కొన్ని రోజులకు సినిమా కూడా తీసేసి మా పేరుతో రిలీజ్ చేస్తారేమో. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలని కోరుకుంటారో అలాంటి సినిమానే చేయబోతున్నా. ప్రభాస్ సినిమా విషయంలో బయటకొచ్చిన సమాచారం ఏదీ నిజం కాదు.