Dhanush-Mrunal | తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య రిలేషన్ ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ గాసిప్స్‌పై తాజాగా మృణాల్ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఎలాంటి డేటింగ్ లేదు. ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ ఆమె స్పష్టం చేశారు. దీంతో కొంతకాలంగా వస్తున్న రూమర్లకు బ్రేక్ పడినట్లైంది. అయితే ఈ గాసిప్స్ కొత్తవి కావు. గతంలో కూడా వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్స్, పార్టీల్లో కనిపించడం, ముఖ్యంగా ఒక సినిమా ప్రీమియర్ సందర్భంగా ధనుష్ ప్రత్యేకంగా హాజరై మృణాల్తో సన్నిహితంగా మెలగడం వంటి పరిణామాలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
అదేవిధంగా మృణాల్ నటించిన హిందీ ప్రాజెక్ట్‌లకు ధనుష్ సోషల్ మీడియాలో స్పందించి ప్రశంసలు కురిపించడం కూడా నెటిజన్లలో అనుమానాలను పెంచింది. ఇక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ అనర్గళంగా తమిళంలో మాట్లాడటం మరోసారి చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ఆమె ఏ తమిళ చిత్రంలోనూ నటించకపోయినా, అంత స్పష్టంగా తమిళం మాట్లాడటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ధనుష్ అని, అతని ద్వారా ఆమె తమిళం నేర్చుకుందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే మృణాల్ తరచూ చెన్నై పర్యటనలు చేయడం కూడా ఈ గాసిప్స్‌కు ఊతమిచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువ ఏదో ఉందనే అనుమానాలు అభిమానుల్లో మళ్లీ పెరిగాయి. అయితే, ఈ రూమర్లు సినిమాలకు ముందస్తు ప్రచారం తీసుకురావడంలో సహాయపడుతున్నప్పటికీ, అవి నిజమా కాదా అనే విషయంపై స్పష్టత మాత్రం రావడం లేదు. ఒకవైపు మృణాల్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ, మరోవైపు కొత్త పరిణామాలు ఈ చర్చను కొనసాగిస్తూనే ఉన్నాయి. మరి ధనుష్–మృణాల్ ఠాకూర్ మధ్య ఉన్న బంధం నిజంగా స్నేహమేనా? లేక మరేదైనా ఉందా? అన్నది ఇంకా ఆసక్తికరంగానే మారింది. ఈ గాసిప్స్‌పై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.