MH CM Devendra Fadnavis | మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ సోమవారం నాగ్‌పూర్‌లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడులు చేశారు. వాహనాలను తగలబెట్టారు. ఘర్షణల్లో 25 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ విధించారు.
అయితే ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ‘ఛావా’ సినిమా చూసి మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్‌పై మరాఠా ప్రజలు కోపం పెంచుకున్నారని ఫడ్నవీస్ ఆరోపించాడు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడ్నవీస్ ముంగళవారం మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌లో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలకు ఛావా సినిమా కారణమని పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలు, అల్లర్లు ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపిస్తున్నాయి. ‘ఛావా’ సినిమా ఔరంగజేబ్‌పై ప్రజల కోపాన్ని రెచ్చగొట్టింది. అయినప్పటికీ, మహారాష్ట్రలో అందరూ శాంతిని కాపాడాలని ఫడ్నవీస్ తెలిపారు. అయితే ఫడ్నవీస్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా.. సినిమా చూసి హింసకు ప్లాన్ చేయడం ఏంటని.. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర మళ్లీ అధికారంలోకి రాగానే మత ఘర్షణలు చేలరేగుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. హీరో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా నటించగా.. అతడి భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మంధన్నా నటించింది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు.