Raaka Budget | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాక’ (Raaka) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రూ. 900 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ల పారితోషికాల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు అల్లు అర్జున్ ఏకంగా రూ. 175 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. కాగా, కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకొణెకు రూ. 25 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది, ఇది హీరో పారితోషికం కంటే దాదాపు ఏడు రెట్లు తక్కువ కావడం గమనార్హం. మరో కీలక పాత్రలో కనిపిస్తున్న రష్మిక మందన్నకు రూ. 5 నుంచి 7 కోట్ల మధ్య పారితోషికం అందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ గణాంకాలపై నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాక’ ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ ఇప్పటికే అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అందులో ఒకటి పోలీస్ అధికారి కాగా, రెండోది సగం మనిషి-సగం రాక్షసుడి పాత్ర అని, మూడోది వీరిద్దరి తండ్రి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో దీపికా, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుండగా, 2026 చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.