Dasara Movie Collections | సినీరంగంలో ప్రతీ హీరోకు మాస్ ఫాలోయింగ్ ఉండాలని ఎంతో ఆరాటపడుతుంటారు. ఎందుకంటే ఎంత కంటెంట్ సినిమాలు చేసిన మాస్ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే అవి కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించలేకపోతాయి. అంతేకాకుండా మాస్ సినిమాలే హీరోలను స్టార్లను చేస్తాయి. దశాబ్దాల సినిమా చరిత్రను చూసుకున్న మాస్ సినిమాలే హీరోలను స్టార్లను చేశాయి. ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలు సైతం మాస్ సినిమాలతోనే ఎంట్రీ ఇస్తున్నారు. కాగా పదిహేనేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్న నాని కూడా మాస్ ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నా.. మాస్ ఆడియెన్స్ సపోర్ట్ లేదు.
దాంతో నాని సినిమాలు ఓ మోస్తరు విజయాలు మాత్రమే సాధిస్తూ వస్తున్నాయి. అయితే దసరాతో తొలిసారి అవుట్ అండ్ అవుట్ మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు దసరాతో వచ్చింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నమోదయ్యాయి. ఇక అంచనాలకు తగ్గట్టే తొలిరోజు నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. వీకెండ్ పూర్తయ్యేలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని నాని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం రిలీజైన 6రోజుల్లోనే ఈ సినిమా ఇంతటి మైలు రాయిని చేరుకుందంటే ప్రేక్షకులు ఈ సినిమాను ఏ రేంజ్లో యాక్సెప్ట్ చేశారో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాతో నానికి మాస్ హీరోగా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ దొరికేసింది. నటుడిగా నానిని ఈ సినిమా మరో స్థాయికి ఎక్కించింది. నాని అనే కాదు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు ది బెస్ట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయిన శ్రీకాంత్ ఓదెలా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకుడిగా ఇది తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు. అంతలా తన టేకింగ్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు.
వెన్నెలగా కీర్తి సురేష్, సూరిగా దీక్షిత్ శెట్టి, చిన్న నంబిగా షైన్ టామ్ చాకో తమ తమ పాత్రల్లో జీవించేశారు. సంతోష్ నారాయణ్ పాటలైతే పిచ్చెక్కించేశాయి. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా నిర్మాతగా సుధాకర్‌కు ఈ సినిమా తొలి హిట్. అయితే ఇప్పటివరకైతే కలెక్షన్లు ఊపేశాయి. కానీ శుక్రవారం రావణాసుర, మీటర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి రేపటి నుంచి కూడా దసరా ఇదే స్పీడ్‌ను కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.