Dasara Movie | దసరా రిలీజై పది రోజులు దాటినా ఇంకా జోరు తగ్గడం లేదు. పైగా గతవారం విడుదలైన రావణాసుర, మీటర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పేల లేకపోయాయి. దాంతో ప్రేక్షకులకు కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో దసరా వైపే పరుగులు తీస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి ‘దసరా’ అలాంటి విజయాన్నే అందించింది. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్, నాని నటనకు ప్రేక్షకులు వెర్రెత్తి పోతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లో ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. దర్శకుడిగా శ్రీకాంత్‌కు తొలి సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌కు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్గా కీర్తి, కీలకపాత్రలో దీక్షిత్ శెట్టి ఇరగదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ఫ్యాన్స్‌కు ఇటు ప్రేక్షకులకు ధమ్ బిర్యానీ పెట్టేశాడు నాని.
కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే దాదాపు రూ.110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో మరో ముప్పై కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దసరా మరో ఘనత సాధించింది. దసరా మూవీ యూఎస్‌లో 2మిలియన్ మార్క్‌ను టచ్ చేసింది. నానికి తొలి 2మిలియన్ మూవీ ఇదే కావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే ఫైనల్ రన్లో ఈ మూవీ 3 మిలియన్ మార్క్ కూడా టచ్ చేస్తుందనడంలో సందేహమే లేదు. ఇక మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న శాకుంతలం, రుద్రుడు సినిమాలపై పెద్దగా బజ్ లేదు. ఆ తర్వాత రోజు రిలీజవుతున్న విడుదల పార్ట్-1 అసలు విడుదలవుతున్న విషయమే సగం జనాలకు తెలియదు. దాంతో వచ్చే వారం కూడా దసరాకు కలిసి వచ్చే చాన్స్ ఉంది.