Darling | తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలై 16 ఏళ్లు దాటిన ఈ సినిమా, తాజాగా 4K వెర్షన్లో ఏప్రిల్ 23న రీ-రిలీజ్ కాగా, అదే స్థాయి క్రేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సమ్మర్ కానుకగా వచ్చిన ఈ రీ-రిలీజ్‌కు అభిమానులు ఊహించని స్థాయిలో స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉదయం షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల రద్దీ కనిపించింది. కటౌట్లకు పాలాభిషేకాలు, కాగితాల వర్షం, హర్షధ్వానాలతో థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపించాయి. సోషల్ మీడియాలో ‘డార్లింగ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలవడం, వింటేజ్ ప్రభాస్ లుక్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించడం విశేషం.
దర్శకుడు కరుణాకరన్ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ ప్రేమకథ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అందించిన మధురమైన పాటలతో అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. అదే మ్యాజిక్ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రిపీట్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్-కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, ఆయన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను మళ్లీ ఆ రోజుల జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి. వసూళ్ల పరంగా కూడా ‘డార్లింగ్’ రీ-రిలీజ్ సంచలనం సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ప్రాంతంలోనే రూ.2 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ స్పందన లభించడం ప్రభాస్ గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.
ప్రస్తుతం పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ను మళ్లీ పూర్తి స్థాయి లవర్ బాయ్‌గా చూడటం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. 2010లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘డార్లింగ్’, ఇప్పుడు రీ-రిలీజ్లోనూ బ్లాక్‌బస్టర్ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటూ ప్రభాస్ స్టార్‌డమ్‌ని తెలియజేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే.