Cockroach Movie ప్రముఖ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథా చిత్రం “కాక్రోచ్” తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సమాజం ఈసడించుకునే మురికి మనుషుల మధ్య చిగురించిన ఓ అరుదైన ప్రేమకథగా, అడ్డురోడ్డులో పడుపు వృత్తి చేసుకునే వేశ్యకు మరియు ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. భ్రష్టు పట్టిన అవినీతి సమాజంలోని చీకటి కోణాలను చూపిస్తూనే, మనుషుల్లోని ద్వంద్వ విలువలపై ఈ సినిమా పదునైన ప్రశ్నలు సంధిస్తుంది. ముఖ్యంగా కాక్రోచ్‌ను చంపితే చప్పట్లు కొట్టి, సీతాకోకచిలుకలపై కవితలు రాసే లోకరీతిని దర్శకుడు ఈ చిత్రంలో ఎండగట్టారు.
ఈ చిత్రంలోని వాస్తవికత మరియు హింసాత్మక ఘట్టాలను పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సున్నిత మనస్కులు మరియు చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేస్తోంది. సినిమాలోని పోరాట దృశ్యాలు అత్యంత సహజంగా ఉండటం కోసం నిజజీవిత కిరాయి హంతకులుగా పేరున్న రియల్ ఫైటర్స్ అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్‌లను నటులుగా ఎంపిక చేయడం విశేషం. ‘సొంతవూరు’ చిత్రంతో ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన తీర్థ కీలక పాత్రలో నటించగా.. మీనాక్షి, రామన్, అంజి, ఎఫ్.ఎం. బాబాయ్, రేలారే రఘు బృందం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ప్రదీప్ చంద్ర సంగీతం, సంతోష్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.