‘తెలంగాణ గత పదేళ్లుగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. కేసీఆర్‌గారు మూడోసారి ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయి. తెలుగు సినీ రంగంలో 24 విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరుతున్నా’ అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్.
మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్‌గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితే అభివృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుంది. సినీ రంగంలోకి లక్షమంది కుటుంబ సభ్యులు బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరుతున్నా’ అన్నారు.
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్‌గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, మరో ఐదేళ్లు ఆయనతో కలిసి నడుద్దామని నటుడు సత్యప్రకాష్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హాస్య నటుడు గౌతమ్‌రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్ గురురాజ్, బందూక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.