Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు ఒకవైపు భారీ ట్రీట్ అందిన.. మరోవైపు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ విషయంలో నిరాశ ఎదురైంది. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే ‘కాకా’ నుంచి టైటిల్, గ్లింప్స్ విడుదలై మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపగా.. ‘విశ్వంభర’ విషయంలో మాత్రం మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్‌లో చిరంజీవిని ఇంతకుముందు చూడని విధంగా సరికొత్త అవతార్‌లో చూపించడం అభిమానులను ఆకట్టుకుంది.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవి పాత్ర, లుక్, యాక్షన్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాకు 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మెగా అభిమానులకు బర్త్‌డే రోజున ఒక పెద్ద గుడ్ న్యూస్ దక్కినట్టయింది. మరోవైపు చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా 2025 జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యం, ఇతర కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి కొత్త పోస్టర్‌తో పాటు ఓఎస్టీ (OST)ని మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈసారి అయినా సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వస్తుందని మెగా అభిమానులు భావించారు. కానీ.. పోస్టర్, ఓఎస్టీ విడుదల చేసినప్పటికీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. దీంతో బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్ అభిమానుల్లో పూర్తి స్థాయి ఆనందాన్ని నింపలేకపోయింది. ‘విశ్వంభర’ విడుదల విషయంలో కొంతకాలంగా 2026 అక్టోబర్ 16 తేదీ ప్రచారంలో ఉంది. వివిధ టికెటింగ్, సినిమా రిలీజ్ డేట్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ తేదీ కనిపిస్తోంది. దీంతో అక్టోబర్ 16న ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం మాత్రం ఈ తేదీని అధికారికంగా ధృవీకరించలేదు.