Bigg Boss | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టేందుకు సామాన్యులు సాగిస్తున్న ‘అగ్నిపరీక్ష’ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన హౌస్‌లోకి వెళ్లే అవకాశం కోసం కంటెస్టెంట్లు టాస్కుల్లో తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో ఫైర్ కార్డుల కోసం పోటీ కొనసాగుతోంది. ఈ కార్డులు రాబోయే టాస్కుల్లో కంటెస్టెంట్లకు కీలకమైన ప్రయోజనాన్ని అందించనున్నాయి. అయితే వాటిని సొంతం చేసుకోవాలంటే కఠినమైన టాస్కుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ ఫైర్ కార్డ్ టాస్కులను నిర్వహించేందుకు గతంలో అగ్నిపరీక్షలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్లో డీమాన్ పవన్ ఎంట్రీతో అగ్నిపరీక్ష వేదిక ఒక్కసారిగా సందడిగా మారింది.
వేదికపైకి వచ్చిన డీమాన్ పవన్.. సృష్టితో కలిసి రొమాంటిక్ డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇద్దరి పెర్ఫార్మెన్స్కు జడ్జెస్‌తో పాటు అక్కడున్న వారంతా ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఫైర్ కార్డ్ కోసం జరిగిన టాస్క్‌లో పవన్.. సృష్టి, కృష్ణను ఎంపిక చేశాడు. వీరి మధ్య జరిగిన పోటీలో సృష్టి విజయం సాధించి తొలి ఫైర్ కార్డును సొంతం చేసుకుంది. ఆ కార్డును నలుగురు జ్యూరీ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉండగా.. సృష్టి నవదీప్‌కు అందించింది. అనంతరం మరోసారి సృష్టితో కలిసి డీమాన్ పవన్ డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశాడు.రెండో రౌండ్లో మాజీ కంటెస్టెంట్ దివ్య అగ్నిపరీక్ష వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో తక్కువ రోజులు ఉన్నప్పటికీ తనదైన ముద్ర వేసిన దివ్య.. అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఎవరు ఎంత బలంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చింది.
ఈ టాస్క్‌లో భాగంగా బాగి, ఝాన్సీ, ప్రియాంక, షాలిని పాల్గొన్నారు. వీరిలో షాలిని, ప్రియాంకలు అపూర్వను టార్గెట్ చేయగా.. ఝాన్సీ హేమంత్‌ను, బాగి గాయత్రిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్ల ప్రభావం తర్వాతి టాస్కుల్లో కూడా కనిపించింది.అనంతరం బాగి, ప్రియాంక మధ్య ఫైర్ కార్డ్ కోసం పోటీ నిర్వహించగా.. బాగి విజయం సాధించింది. ఆమె తనకు వచ్చిన ఫైర్ కార్డును శ్రీముఖికి అందించింది. మూడో ఫైర్ కార్డ్ కోసం ఝాన్సీ, షాలిని పోటీపడ్డారు. ఈ టాస్క్‌కు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి జడ్జెస్ ఇద్దరికీ కఠినమైన టాస్క్ పెట్టారు. కంటెస్టెంట్లలో ఎవరు ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తారో తెలుసుకునే విధంగా ఈ టాస్క్ సాగింది. ఇందుకోసం బ్లూ, రెడ్ రంగుల దారాలను పోటీదారుల కాళ్లకు కట్టారు. ఎవరి వైపు మద్దతు ఎక్కువగా ఉంటుందో వారే విజేతగా నిలిచేలా టాస్క్ రూపొందించారు.
ఈ సమయంలో షాలినికి మద్దతుగా కట్టిన దారాలను అపూర్వ, గాయత్రి విప్పేశారు. దీంతో నామినేషన్ల ప్రభావం మరోసారి స్పష్టంగా కనిపించింది. చివరకు ఝాన్సీ విజయం సాధించి ఫైర్ కార్డును దక్కించుకుంది. ఫైర్ కార్డుల టాస్కులు ముగిశాయని అనుకుంటున్న సమయంలో మాజీ కంటెస్టెంట్ అభిజిత్ ‘ఎల్లో కార్డ్’తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ కార్డ్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒక్కసారిగా టెన్షన్ పెంచింది.ఎవరైనా టాస్కుల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేదని అనిపించినా ఈ ఎల్లో కార్డును ఉపయోగించవచ్చు. ఎల్లో కార్డ్ దక్కిన కంటెస్టెంట్ డేంజర్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లకు అభిజిత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఇక నుంచి జరిగే టాస్కుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.