Bigg Boss 10 | బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సీజన్ 10 కావడంతో ఈసారి మరింత ప్రత్యేకంగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో సరికొత్తగా షోను ప్రజెంట్ చేయబోతున్నారనే టాక్ ఆసక్తిని పెంచుతోంది.ఇక ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో ఓ కంటెస్టెంట్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోయే తొలి కంటెస్టెంట్‌గా జానపద సింగర్ ఝాన్సీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమెకు ఈ అవకాశం నేరుగా ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా దక్కింది. ఇటీవల ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2లో తనదైన ఆటతీరుతో ఝాన్సీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో దూకుడుగా పాల్గొంటూ తనలోని పోరాట స్ఫూర్తిని చూపించారు. ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేలో ‘టికెట్ టు బిగ్‌బాస్’ అనే ప్రత్యేక అవకాశం ప్రకటించారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పించారు. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించడంతో.. ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. సెప్టెంబర్ 6న జరగనున్న గ్రాండ్ లాంచ్‌లో ఆమె అధికారికంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.
దీంతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కంటెస్టెంట్ల జాబితాలో కనీసం ఒక్క పేరుపై మాత్రం స్పష్టత వచ్చినట్టయింది. ఝాన్సీ స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే కుటుంబానికి సహాయం చేస్తూ వ్యవసాయ పనుల్లోనూ పాల్గొనేవారు. పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టపడే ఝాన్సీ.. క్రమంగా జానపద గీతాల వైపు అడుగులు వేశారు. తన ప్రత్యేకమైన గొంతు, తెలంగాణ జానపద శైలితో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జానపద గీతాల ద్వారా ఝాన్సీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ వచ్చింది. ‘రామ్‌రెడ్డి దొర’, ‘అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య’, ‘అందాల రాధ’, ‘కాసరం కట్ట’ వంటి పాటలు ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీనే ఆమెను ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం వరకు తీసుకొచ్చింది. అక్కడ తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. చివరికి ‘టికెట్ టు బిగ్‌బాస్’ను కూడా గెలుచుకున్నారు.