Bichagadu-3 Movie | ఏడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది బిచ్చగాడు మూవీ. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకైతే లాభాల పంట పండింది. కాగా గతేడాది ప్రథమార్థంలో ఈ సినిమాకు సీక్వెల్‌కు స్టార్ట్ చేశాడు విజయ్ ఆంటోని. మొదట వేరే దర్శకుడితో మొదలైన సినిమా.. తర్వాత ఆయన తప్పుకోవడంతో స్వయంగా విజయ్ ఆంటోనియే రంగంలోకి దిగి మెగాఫోన్ పట్టాడు. ఇక భారీ అంచనాల నడుమ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
బిచ్చగాడు సినిమాకు దరి దాపుల్లో లేదని ఎన్నో విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే తొలిరోజే నాలుగు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేవు. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపు రూ.10 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. తమిళంలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ ఉత్సహంలో విజయ్ ఆంటోని తాజాగా బిచ్చగాడు-3 కూడా ఉంటుందని ప్రకటించాడు. 2025లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని తెలిపాడు. ఇక బిచ్చగాడు-2 లాగే ఒక కొత్త కథతో తెరకెక్కుతుందని, తొలి రెండు సినిమాలతో దీనికి సంబంధం ఉండదని విజయ్ వెల్లడించాడు.