పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ వస్తుంది అంటే అభిమానులలో ఎంత ఆసక్తి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా పవన్ గళ్ల లుంగీ కట్టిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రానున్న అప్డేట్ ఏ రేంజ్లో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా, వారి అంచనాలును మించేలా ఇది ఉంది.
కొద్ది సేపటి క్రితం ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా, ఇందులో పవన్ వీరావేశంతో అరెయ్ డానీ.. బయటకు రారా నా కొడకా అంటూ అరుస్తూ కనిపించారు. లుంగీ మడతేసి రౌడీలను కొడుతుంటే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. భీమ్లానాయక్ కి ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని వాయిస్ ఓవర్లో వినిపించడం కొస మెరుపు. పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ కాగా, అదే పేరుని సినిమా టైటిల్‌గా పెట్టారు. మొత్తానికి ఈ రోజు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ రికార్డుల వేట మొదలు పెట్టింది.
పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో వస్తోన్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాను మన శైలికి తగ్గట్టుగా త్రివిక్రమ్ కథలో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం చకచకా షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంటోంది. ఇప్పటికే వదిలిన మేకింగ్ వీడియోలు, స్టిల్స్ అన్నీ కూడా అందరినీ మెప్పించాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్సులో ఉన్న ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక రవి కే చంద్రన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.