Bandla Ganesh | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పాల్గొని తనదైన శైలిలో చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి వ్యక్తిత్వం, సేవా గుణం, కెరీర్ గురించి ప్రశంసలు కురిపించిన బండ్ల గణేష్.. ఇటీవల మెగాస్టార్‌ను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన శివశంకర వరప్రసాద్.. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు గర్వపడే మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారని కొనియాడారు. గత 71 ఏళ్లుగా ఆయన తన వెలుగుతో అభిమానులను ఆనందింపజేస్తూ, ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ, తన చుట్టూ ఉన్న వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు.
చిరంజీవి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, వ్యక్తిత్వం గురించి మాట్లాడేందుకు తనకు ఎలాంటి సందేహం లేదని.. తాను కేవలం నిజాలే మాట్లాడుతున్నానని బండ్ల గణేష్ భావోద్వేగంగా చెప్పారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒక కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నై నగరానికి వచ్చిన చిరంజీవి.. తన కష్టంతో, ప్రతిభతో, పట్టుదలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని బండ్ల గణేష్ అన్నారు.“ఎవరు ఈ కుర్రాడు? ఎవరీ అడ్రస్ లేని వ్యక్తి?” అన్న స్థాయి నుంచి మెగాస్టార్ అంటే ఏమిటో చూపించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. తనకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవేనని చెప్పారు.
అలాగే, ఒక మెగాస్టార్‌కు రామ్ చరణ్ రూపంలో మరో స్టార్ వారసత్వాన్ని కొనసాగించడం అరుదైన అదృష్టమని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇటీవల చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ తనదైన స్టైల్లో స్పందించారు. చిరంజీవి వెనకాల ఎంతమంది ఉన్నా, కొందరు దూరమైనా.. ఆయన సాధించిన చరిత్ర మాత్రం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబంపై చూపించే ప్రేమకు సంబంధించిన ఓ వ్యక్తిగత సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు, ఆయన తన చెల్లికి నడుము నొప్పి ఉండటంతో మందు రాస్తున్నానని చెప్పారని బండ్ల గణేష్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల పట్ల చిరంజీవి చూపించే ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు.
85 ఏళ్ల తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తిత్వం చిరంజీవిదని.. తన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా, తనవారిగా భావించే ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనస్తత్వం ఆయనదని కొనియాడారు. 25 ఏళ్ల క్రితం తనకు ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో చిరంజీవి తనపై చూపించిన అభిమానాన్ని కూడా బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నానని చెప్పినప్పుడు, బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ చిరంజీవి తనను వెతుక్కుంటూ షాద్‌నగర్ వరకు వచ్చారని తెలిపారు. నడుము నొప్పి ఉన్నప్పటికీ దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించి తన ఇంటికి వచ్చిన చిరంజీవి గొప్ప వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. చిరంజీవి క్యారెక్టర్, నిజాయితీ, స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
ఇక చిరంజీవిపై వచ్చే విమర్శలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి ఇతరులను తొక్కి ఎదిగారంటూ కొందరు చేసే వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. “చిరంజీవి ఎవరినీ తొక్కరు.. ఆయన ఎక్కుతారు, ఎక్కిస్తారు. లేపుతారు.. లేపి కూర్చోబెడతారు” అంటూ బండ్ల గణేష్ ఉద్వేగంగా అన్నారు. ఎవరికైనా టాలెంట్, నిజాయితీ ఉంటే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానానికి తీసుకెళ్లే వ్యక్తిత్వం చిరంజీవిదని పేర్కొన్నారు. చిరంజీవి ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే నాలాంటి ఎంతోమందికి ధైర్యం, స్ఫూర్తి లభించేది కాదని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులోనూ మరిన్ని ఘన విజయాలు సాధించాలని బండ్ల గణేష్ ఆకాంక్షించారు.