‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో డాక్టర్ అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్ గురించి జనం ఎంత మాట్లాడుకున్నారో.. డాక్టర్ ప్రీతి గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు. ఆ పాత్రలను దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మలచిన తీరు అలా ఉంది. ఆ పాత్రల యాటిట్యూడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యువతరంపై వాటి ప్రభావం మామూలుగా లేదు. హీరోహీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉండేలా తొలి కథ రాసుకున్నాడు సందీప్‌రెడ్డి. ఆయన్నుంచి వస్తున్న మలి కథ ‘యానిమల్’.
ఇందులో కూడా హీరోహీరోయిన్లకు సందీప్ సమప్రాధాన్యత ఇచ్చాడా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇందులో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక మందన్నను ‘గీతాంజలి’గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ లుక్‌లో రష్మిక ఇన్నోసెంట్ లుక్‌లో బ్యూటీఫుల్‌గా కనిపిస్తున్నది. రణబీర్‌కపూర్ మాస్‌గా రగ్గడ్‌గా కనిపిస్తే, రష్మిక అందుకు భిన్నంగా అందంగా, అమాయకంగా కనిపించడం విశేషం. దాదాపు తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’ విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు సందీప్‌రెడ్డి. మరి ‘యానిమల్’ కూడా ‘అర్జున్‌రెడ్డి’లా బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.