అగ్ర హీరో వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మాతగా, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానున్నది. అగ్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని వినోదాత్మకంగా ప్రకటిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఓ వినోదాత్మక వీడియోను విడుదల చేశారు.
జంధ్యాల ‘వివాహ భోజనంబు’ సినిమాలో బ్రహ్మానందాన్ని సుత్తి వీరభద్రరావు సముద్రపు ఒడ్డున ఇసుకలో గొంతు వరకూ పాతిపెట్టి, ఊళ్ల పేర్లు చదివే సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ ఈ వీడియోని రూపొందించారు. ఇందులో బ్రహ్మానందం స్థానంలో జీవీ ప్రకాశ్‌కుమార్, సుత్తి వీరభద్రరావు ప్లేస్‌లో అనిల్ రావిపూడి కనిపించి, వినోదాన్ని పంచారు. పండుగ వాతావరణానికి తగ్గట్టుగా మంచి ట్యూన్ కావాలని అనిల్ అడగడం వీడియోలో నవ్వులు పూయించింది. ఈ వీడియోలో గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా భాగమయ్యారు, సంక్రాంతి మూడ్‌ని ప్రతిబింబించే కథ, కథనాలతో, అన్ని వర్గాలకూ నచ్చేలా ఈ సినిమా ఉండబోతున్నదని ప్రకటనలో మేకర్స్ పేర్కొన్నారు.