షారుఖ్ ఖాన్‌తోనే బాలీవుడ్లో స్టార్డమ్ అంతమైపోతుందని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీనియర్ హీరో అనిల్ కపూర్. ఇండస్ట్రీలో స్టార్డమ్ పోవడం అనేది జరగదు అని, కాలానుగుణంగా అది మార్పులకు లోనుకావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కపూర్ మాట్లాడుతూ…‘షారుఖ్‌ఖాన్ స్టార్డమ్ ప్రభావం గురించి ఎవరికీ అనుమానం లేదు. అయితే ఆయనతోనే స్టార్డమ్ అంతమవుతుంది అనేది సరికాదు.
అప్పట్లో ఎల్విస్ ప్రిస్లీ చనిపోయినప్పుడు ఇక పాప్ మ్యూజిక్ అంతమవుతుంది అనుకున్నారు. కానీ మైఖేల్ జాక్సన్ వచ్చాడు. అలాగే అమితాబ్, సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్, రజినీకాంత్, ఐశ్వర్యరాయ్…ఇలా ఎంతోమంది స్టార్డమ్ ప్రభావాన్ని సినీరంగంపై చూపించారు’ అని అన్నారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానంలోకి అడుగుపెట్టారు. నటుడిగా 30 ఏళ్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా షారుక్ స్పందిస్తూ…‘30 ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞుడను. మీ అభిమానం ఉన్నంతకాలం నేను ఇన్నేళ్లని లెక్కపెట్టుకోవాల్సిన పనిలేదు’ అని అన్నారు.