Naatu Naatu song Live Performance | మరికొన్ని గంటల్లో ఆస్కార్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు ప్రేక్షకులు ఈ వేడుకల ప్రధానోత్సవం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నాటు నాటు పాటకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇక ఈ పాటకున్న ఆదరణ దృష్ట్యా ఆస్కార్ నిర్వాహకులు లైఫ్ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇటీవలే చరణ్, తారక్‌లు నాటు నాటు పాటకు రిహార్సల్స్ చేసే సమయం లేదని, అందుకే అస్కార్ వేదికపై డ్యాన్స్ చేయడం లేదని స్పష్టం చేశారు. దాంతో మరి ఈ వేదికపై నాటు నాటు స్టెప్పులేసేది ఎవరై ఉంటారని ఆసక్తి అందరిలోనూ ఉంది.
కాగా అమెరికాకు చెందిన ప్రముఖ నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లెబ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయబోతున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ‘స్పెషల్ న్యూస్.. ఆస్కార్స్ వద్ద నాటు నాటు పాటకు నేను లైవ్ ప్రదర్శన ఇవ్వబోతున్నాను. ప్రపంచలోనే ఎంతో ప్రతిష్టాత్మక వేదికపై భారత్ తరుపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందకు సంతోషంగా ఉంది’ అంటూ తన ఫోటోను షేర్ చేసింది. ఇక ఇదే వేదికపై కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌గా నాటు నాటు పాటను పాడనున్నారు.
ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు పాట ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దాదాపు ఖాయమే అన్నట్లు హాలీవుడ్ మీడియాలు కూడా కోడై కూస్తున్నాయి. ఇక ఇప్పటికే ట్రిపుల్ఆర్ బృందం పలు హాలీవుడ్ మీడియాలకు వరుసగా ఇంటర్వూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ గురించి, నాటు నాటు పాట గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.