Lenin | అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్‌కు, ఈ సినిమా కొత్త ఆశలు నింపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, విడుదల అనంతరం ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన అందుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘లెనిన్’ కథ పరంగా సుపరిచితమైన అంశాలనే తీసుకున్నప్పటికీ, దర్శకుడు కథనాన్ని ఆసక్తికరమైన ట్విస్టులతో నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని సినీ అభిమానులు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాకు వస్తున్న ప్రశంసల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అఖిల్‌దే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో ఆయన చూపించిన భావోద్వేగ నటనకు ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ నటనపై వచ్చిన విమర్శలకు ఈ సినిమా సమాధానం చెప్పిందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. సినిమాకు లభిస్తున్న మంచి స్పందన నేపథ్యంలో చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. తన కెరీర్లో తొలిసారి నటుడిగా ఇంతటి ప్రశంసలు రావడం, సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం చూసి హీరో నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం, అనంతరం ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి లోనవడం అక్కడున్న వారిని కదిలించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు ఈ దృశ్యాలను విస్తృతంగా షేర్ చేస్తూ, అఖిల్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ‘లెనిన్’తో అఖిల్ తన కెరీర్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం అఖిల్ సినీ ప్రయాణానికి కొత్త ఊపునిచ్చే మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో బాక్సాఫీస్ ఫలితాలు తేల్చనున్నాయి.