Adivi Sesh | వైవిధ్యమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘G2’ ప్రస్తుతం సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం, జూలై నెలలో భారీ స్థాయిలో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ స్పై ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణ బృందం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ షూటింగ్ షెడ్యూల్‌కు ముందు అడివి శేష్ తన కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. క్లీన్ షేవ్ లుక్‌లో మరింత ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తున్న శేష్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. స్పై పాత్రకు తగ్గట్టుగా లీన్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ, జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. ‘తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం.. జూలైలో #G2 షూట్ ప్రారంభం కాబోతోంది’ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘గూఢచారి తిరిగి వస్తున్నాడు’, ‘ఇది మరో లెవెల్ స్పై థ్రిల్లర్ అవుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ‘G2’ చిత్రాన్ని దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమా అడివి శేష్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. కథ, స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ చిత్రం ఇప్పుడు ఫ్రాంచైజీగా మారింది. దీంతో ‘G2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.