‘మా మావయ్య యార్లగడ్డ సురేంద్ర అంటే నాకెంతో ఇష్టం. ఆయన కోసమే వచ్చాను. తప్పకుండా సుప్రియ మంచి సినిమా తీసే ఉంటుంది. జనం మెచ్చే సినిమా చేయాలనే కసితో ఈ టీమ్ పనిచేశారని ట్రైలర్ చూస్తే తెలుస్తున్నది. అడివి శేష్ మంచి నటుడు. సినిమా సినిమాకూ నటుడిగా ఎదుగుతూ వచ్చాడు. మృణాళ్ఠాకూర్ అన్ని భావాలూ పలికించగల నటి. వీరిద్దరితోపాటు ఈ టీమ్ అందరికీ ఇది బెస్ట్ మూవీ అవ్వాలని ఆశిస్తున్నా’ అని అగ్ర హీరో వెంకటేశ్ అన్నారు. అడివి శేష్, మృణాళ్ఠాకూర్ జంటగా రూపొందిన పానిండియా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. షానియోల్ డియో దర్శకుడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ పై విధంగా స్పందించారు. మరో అతిథి స్టార్‌బోయ్ సిద్ధు జొన్నలగడ్డ చిత్రం విజయంపై ఆశాభావం వెలిబుచ్చారు. చిత్ర కథానాయకుడు అడివి శేష్ మాట్లాడుతూ ‘సినిమా చూసుకున్నాక చాలా గ్రేట్‌గా అనిపించింది. నన్ను నిలబెట్టడానికి ఎంతోమంది పడిన కష్టం ఈ సినిమా. మా డైరెక్టర్ షానియోల్ డియో విజన్, సుప్రియ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా లేదు. అయిదు సినిమాలు చేస్తే చాలు అనుకున్న నేను ఇంతమంది అభిమానాన్ని పొందగలడం గొప్ప ఫీలింగ్. ఈ సినిమాలో కామన్ ఫ్యాక్టర్ లవ్.
ఈ సినిమాలోని నా పాత్రలో ఆకాశమంత ప్రేమను చూస్తారు. మృణాళ్ఠాకూర్ కేరక్టర్ ఈ సినిమాకు బ్యాక్‌బోన్. ముఖ్యంగా ఇంట్రవెల్లో ఆమె పాత్ర పిచ్చెక్కిస్తుంది. ఏప్రిల్ 10న థియేటర్లకు వస్తున్నాం. మనసుపెట్టి చేసిన సినిమా. మంచి సినిమా. తెరపై మా కష్టాన్ని చూసి దీవించండి’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందంతో పాటు నిర్మాతలు డా.సురేశ్‌బాబు, మైత్రీ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అభిషేక్ అగర్వాల్, దామోదరప్రసాద్, స్వప్నాదత్, జాన్వీనారంగ్, సునీల్ నారంగ్, దర్శకులు సాయిమార్తాండ్, శశికిరణ్ తిక్కా, శౌరవ్, కార్తీక్ ఘట్టమనేని, రాహుల్ రవీంద్రన్, సన్నీ సంజయ్, రచయిత అబ్బూరి రవి కూడా మాట్లాడారు.