Tapsee Pannu | ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. అందం, అభినయంతో మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్లో సైతం తనను తాను నిరూపించుకుంది. అంతేనా, సోషల్‌మీడియాలోనూ హల్చల్ చేస్తున్నది. అందం గురించి తనవైన అభిప్రాయాలు చెబుతూ.. నిర్వహణ కాస్త కష్టమే అయినా, ఉంగరాల జుట్టు అంటేనే తనకు ఇష్టమని అంటున్నది ఢిల్లీ భామ తాప్సీ..
నేను ఏ విషయమైనా మంచిచెడులు తెలుసుకునే మాట్లాడుతా. నా తత్వాన్ని అర్థంచేసుకోలేక.. ముక్కుసూటిగా, పొగరుగా కామెంట్స్ చేస్తానని చాలామంది విమర్శిస్తారు. ఆ మాటలు లెక్కచెయ్యను. చెప్పాల్సింది మొహంమీదే చెబుతా. ఎవరికోసమో నా అభిప్రాయాలు మార్చుకోను. నాకు నచ్చినట్టు ఉండటమే నాకు ఇష్టం. ఇదే నా జీవన విధానం. తొలినాళ్లలో కథల ఎంపికలో కాస్త తడబడినా ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సైన్ చేస్తున్నా. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్ర మనకు నప్పుతుందా లేదా అనేది నిర్ధారించుకున్నాకే, ఓ నిర్ణయం తీసుకోవాలి. సినిమా పూర్తయిన తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే ఫలితం తారుమారు అవుతుంది. టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ నాకు సరిపోయే పాత్రలు ఇచ్చింది.
ప్రస్తుతం థియేటర్ కంటే ఓటీటీకే ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే వెబ్‌సిరీస్‌లు పాపులర్ అవుతున్నాయి. నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపుతున్నారు. మంచి కథ వస్తే తెలుగు సినిమాల్లోనూ నటించాలని ఉంది. ప్రస్తుతం మూడు హిందీ, రెండు తమిళ సినిమాలకు పనిచేస్తున్నా. అన్నీ మంచి పాత్రలే.
అందం అనిర్వచనీయమైంది. చూసే కళ్లను బట్టి ఉంటుంది. మన ఆలోచనపైనా ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు నేను స్నేహితులతో పోల్చుకుని అందంగా లేనని తెగ బాధపడేదాన్ని. ఇప్పుడు అసలైన అందం ఏమిటన్నది అర్థమైంది. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే.. అదే అందం, ఆనందం. నా ఫిలాసఫీ ఇదే.
ఉంగరాల జుట్టు చూడ్డానికి బాగానే ఉన్నా, నిర్వహణ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే స్కూల్‌డేస్‌లో జుట్టును స్ట్రెయిట్ చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేసేదాన్ని. అవన్నీ విఫలమై వెంట్రుకలు ఊడిపోయేవి. నాకు ఉంగరాల జుట్టే అందమని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను. అప్పటినుంచీ ప్రయోగాలు మానేసి నన్ను నేను
ప్రేమించడం నేర్చుకున్నా. నేను మోడలింగ్ చేసే టైమ్‌లో చాలామంది నా లుక్స్కంటే జుట్టే అందంగా ఉంటుందని పొగిడేవారు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
ఉంగరాల జుట్టయితేనేం, అందంగా ఉంటుంది కాబట్టే, నాకు ఎక్కువగా హెయిర్ ఆయిల్ కంపెనీ యాడ్స్ వస్తున్నాయి.
‘శభాష్ మిథూ’ నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ సినిమా నటిగా మంచి అనుభవాన్నే కాదు, ఆప్తమిత్రురాలిని కూడా అందించింది. మిథాలీ, నేను స్నేహితులయ్యాం. ఒక మహిళ విజయం వెనుక ఎంత బాధ, ఎన్ని అవమానాలు దాగుంటాయన్నది తెలుసుకునే అవకాశం వచ్చింది.
“ఒకప్పుడు బొద్దుగా ఉన్న తాప్సీ ఇప్పుడు ఫిట్‌గా మారడం వెనుక సీక్రెట్ ఇదే”