ఉత్తరాదిలో ఉత్తమ నటిగా, దక్షిణాదిలో గ్లామర్ తారగా.. గుర్తింపు తెచ్చుకున్నది తాప్సీ పన్ను. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ స్థాయికి చేరుకున్నది తాప్సీ. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డుంకీ’లో తన అభిమాన హీరో షారుక్ ఖాన్‌కు జోడీగా కనిపించబోతున్నది. ఇది తనకు మరచిపోలేని అనుభవమని అంటున్నది.
‘పన్నెండేండ్ల సినీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క లోటును భర్తీ చేసుకోనున్నా. చిన్నప్పటి నుంచీ నాకు షారుక్ అంటే అభిమానం. నేను నైంటీస్ గాళ్‌ని. నా హైస్కూల్ రోజుల నుంచి షారుక్ నా సూపర్‌స్టార్. ఆ అభిమానం అలానే ఉంది. వ్యక్తిగతంగానూ, వృత్తిరీత్యా ఆయనంటే చాలా ఇష్టం. ఒక అభిమానిగా, తనతో కలిసి పనిచేయడం అద్భుతమైన విషయం. షారుక్ కామెడీ టైమింగ్, తోటివారితో ప్రవర్తించే విధానం.. అన్నీ నన్ను మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి.
రాజీపడను
సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికే కట్టుబడి ఉంటా. రాజీ ప్రసక్తే లేదు. కంటెంట్ విషయానికి వస్తే.. దాన్ని ద్విభాష, త్రిభాష, పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారా? లేదా అనేది ఆరా తీస్తున్నా. కథకు నేపథ్యం కూడా ముఖ్యం.. ‘పుష్ప’ లాంటి సినిమా డబ్బింగ్‌తో ఇండియానే ఓ ఊపు ఊపేసింది కదా!
సంతృప్తి ముఖ్యం
కెరీర్ మొదట్లో భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు ఆ అవాంతరాలన్నీ దాటుకొని వచ్చేశాను. మొదట్లో హిందీ మాట్లాడే బ్యాచ్ నన్ను గుర్తించకపోయినా పట్టించుకోలేదు. పారితోషికం తక్కువైనా సరే, ఆత్మసంతృప్తినిచ్చే సినిమాలే చేశాను. భవిష్యత్‌లోనూ చేస్తాను. సినిమా నిడివి తొమ్మిది నిమిషాలైనా.. 90 నిమిషాలైనా నేను ఇబ్బందిపడను. ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలే చెయ్యాలని నిశ్చయించుకున్నా.