Aamir Khan | బాలీవుడ్లో ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమిర్ ఖాన్ తన సినిమాలపై ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి బయటపెట్టారు. కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించినప్పటికీ, ఒక సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే తాను ఎంతగా బాధపడతానో తాజాగా వెల్లడించారు. తన సినిమాల పరాజయాలను చాలా వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పిన ఆమిర్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమిర్ ఖాన్, సినిమా అనేది తనకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదని, అది తన జీవితంలో ఒక భాగమని తెలిపారు. ప్రేక్షకుల కోసమే తాము సినిమాలు చేస్తామని, వారు సమయం, డబ్బు ఖర్చు చేసి థియేటర్లకు వస్తారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సినిమా వారికి నచ్చకపోతే, దానిని ప్రేక్షకుల తప్పుగా కాకుండా తమ వైఫల్యంగా భావిస్తానని చెప్పారు.
సినిమా ఫ్లాప్ అయితే తనకు తీవ్ర బాధ కలుగుతుందని, కొన్ని సందర్భాల్లో రెండు నుంచి మూడు నెలల వరకు మానసికంగా కుంగిపోతానని వెల్లడించారు. “ఒక సినిమా నాకు పిల్లలాంటిది. దానిని ప్రేక్షకులు తిరస్కరిస్తే అది నాకు ఎంతో బాధ కలిగిస్తుంది” అని ఆయన తెలిపారు. అలాగే ఆ బాధ నుంచి బయటపడేందుకు సమయం అవసరమవుతుందని చెప్పారు. ఆ భావోద్వేగాలను అంగీకరించి, వాటిని బయటపెట్టిన తర్వాతే మళ్లీ కొత్త ప్రయాణం ప్రారంభించగలుగుతానని వివరించారు.సినిమా నిర్మాణ ప్రక్రియ గురించి కూడా ఆమిర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో షూటింగ్ దశలోనే సినిమా ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చనే భావన కలిగిందని తెలిపారు. ఫస్ట్ కట్ చూసినప్పుడు తనను తాను మోసం చేసుకోనని, నచ్చకపోతే ఎక్కడో లోపం ఉందని అర్థం చేసుకుంటానన్నారు.
తారే జమీన్ పర్, ఢిల్లీ బెల్లి, లాపట్టా లేడీస్ వంటి చిత్రాలు సరైన రూపం దాల్చేందుకు ఎడిటింగ్ దశలో ఎక్కువ సమయం తీసుకున్నామని చెప్పారు. ప్రేక్షకులకు చేరాల్సిన భావోద్వేగం సరైన విధంగా అందకపోతే మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రేక్షకుల అభిప్రాయానికి తాను ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ప్రత్యేక స్క్రీనింగ్‌ల ద్వారా ప్రేక్షకుల స్పందనను గమనిస్తామని, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సినిమా ప్రభావాన్ని అంచనా వేస్తామని వెల్లడించారు. ఇక ప్రస్తుతం 3 ఇడియట్స్‌కు సీక్వెల్‌గా ప్రచారం జరుగుతున్న 4 ఇడియట్స్ ప్రాజెక్ట్‌పై కూడా బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఇందులో విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.