న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రైవేటు వాహనాల కొనుగోళ్లు తగ్గినా.. మారుతి సుజుకీ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 మోడల్స్‌లో 7 ఆ సంస్థకు చెందినవే కావడం విశేషం. ఇందులోనూ మారుతీ సుజుకీ వేగన్ ఆర్ టాప్‌లో నిలిచింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఇదే. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 18,656 వేగన్ ఆర్ కార్లు అమ్ముడైనట్లు ఆటోమోటివ్ అనలిటిక్స్ అందించే సంస్థ జాటో డైనమిక్స్ ఇండియా వెల్లడించింది.
టాప్ టెన్‌లో మారుతి సుజుకీ నుంచి వేగన్ ఆర్ కాకుండా స్విఫ్ట్, ఆల్టో, బ్యాలెనో, డిజైర్, ఈకో, విటారా బ్రెజా ఉన్నాయి. ఇవి కాకుండా హ్యుండాయ్ నుంచి క్రెటా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ ఉన్నాయి. ఏప్రిల్‌లోని మొత్తం కార్ల అమ్మకాల్లో సగం ఈ పది మోడల్స్వే అని జాటో ఇండియా స్పష్టం చేసింది. మార్చి నెలలో మూడోస్థానంలో ఉన్న వేగన్ ఆర్ ఏప్రిల్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో స్విఫ్ట్ రెండోస్థానానికి దిగింది.