న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గడం, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 నియంత్రణలను సడలించడంతో గత ఏడాది జులై-సెప్టెంబర్ క్వార్టర్లో పట్టణ నిరుద్యోగిత 9.8 శాతానికి తగ్గింది. అంతకుముందు క్వార్టర్లో పట్టణ నిరుద్యోగిత 12.6 శాతంగా నమోదైంది.
గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన నివేదిక ప్రకారం 5676 అర్బన్ బ్లాక్స్లో సర్వే నిర్వహించి 1,71,405 మందిని సర్వే పలుకరించింది. 15 ఏండ్లు పైబడిన వారిలో పట్టణ నిరుద్యోగిత గత ఏడాది జనవరి-మార్చిలో 9.3 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక పేర్కొంది.
కొవిడ్ సెకండ్ వేవ్ అనంతరం నిరుద్యోగిత రేటులో ఆశించిన తగ్గుదల నమోదైందని ఈ గణాంకాలు వెల్లడించాయి. ఇక 2021 మూడో క్వార్టర్లో పట్టణ నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ మహమ్మారి ముందున్న స్ధాయితో పోలిస్తే అధికంగానే ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మహిళా నిరుద్యోగిత రేటు కూడా తక్కువగా నమోదైంది.