Job Hiring | ముంబై, డిసెంబర్ 7: వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిరుడుతో పోల్చితే 12 శాతం హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్టు గురువారం విడుదలైన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో తేలింది. ఐటీ-సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో మారిన పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తాజా నివేదికలో నౌకరీ.కామ్ పేర్కొన్నది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వైట్-కాలర్ జాబ్ రిక్రూట్మెంట్లు ఆయా రంగాలవ్యాప్తంగా 2,781గా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 2,433కే పరిమితమయ్యాయి. కాగా, నౌకరీ.కామ్ రెజ్యూమ్ డాటాబేస్‌పై వచ్చిచేరే కొత్త ఉద్యోగావకాశాలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా నెలనెలా ఈ జాబ్‌స్పీక్ సూచీ వస్తూ ఉంటుంది. ఈ ఇండెక్స్‌లో భారతీయ జాబ్ మార్కెట్, హైరింగ్ కార్యకలాపాల తీరుతెన్నులను నౌకరీ.కామ్ విశ్లేషిస్తుంది.
టెలికం రంగంలో..
నిరుడుతో పోల్చితే ఈ అక్టోబర్, నవంబర్ నెలల్లో టెలికం రంగంలో ఉద్యోగ నియామకాలు గరిష్ఠంగా 18 శాతం పడిపోయాయి. ఆ తర్వాత విద్యా (17 శాతం), రిటైలింగ్ (11 శాతం) రంగాల్లో రిక్రూట్మెంట్లు దిగజారినట్టు నౌకరీ.కామ్ తెలియజేసింది. ఇక హాస్పిటాలిటీ, ట్రావెల్, ఆటో, ఆటో అనుబంధ రంగాల్లో నియామకాలు స్తబ్ధుగా ఉన్నట్టు స్పష్టం చేసింది. గతంతో పోల్చితే ఈ రంగాల్లో ఉద్యోగ నియామకాలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నది.
చమురు, గ్యాస్ రంగాల్లో..
చమురు, గ్యాస్ రంగాల్లో వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు నిరుడుతో చూస్తే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో 9 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ చూపింది. ఎనర్జీ కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరణ బాట పట్టడం కలిసొచ్చిందని చెప్పింది. దేశవ్యాప్తంగా రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ రంగంలో వైట్-కాలర్ ఉద్యోగులకు సహజంగానే డిమాండ్ ఉన్నట్టు వివరించింది. అలాగే ఔషధ రంగంలోనూ కొత్త ఉద్యోగావకాశాలు 6 శాతం పెరిగాయి. ఇక బీమా రంగంలో 5 శాతం వృద్ధి ఉన్నట్టు నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. కాగా, ఐటీ రంగంలో ఓవరాల్ హైరింగ్ 22 శాతం తగ్గుముఖం పట్టిందన్న ఆయన ఈ ఏడాది ప్రథమార్ధం ఆశాజనకంగా లేకున్నా.. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో 1 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు.
ఏఐ ఇంజినీర్లకు గిరాకీ
కృత్రిమ మేధస్సు (ఏఐ) సంబంధిత రంగాల్లో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఫుల్ స్టక్ డాటా సైంటిస్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, వీరికి కొత్త ఉద్యోగావకాశాలు గతంతో పోల్చితే గడిచిన రెండు నెలల్లో 64, 16 శాతం చొప్పున పెరిగాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ఇదిలావుంటే దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే నాన్-మెట్రో నగరాల్లో వైట్-కాలర్ జాబ్స్ హైరింగ్ బాగా ఉందని మరోమారు రుజువైంది. ఈ అక్టోబర్, నవంబర్ నెలల్లో వడోదరలో 9 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైల్లో 12 శాతం చొప్పున క్షీణత ఉన్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు నౌకరీ.కామ్ పేర్కొన్నది. ఇక సీనియర్లకు ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. 16 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నవారికి 26 శాతం అవకాశాలు పెరిగినట్టు తేలింది. ఇదే సమయంలో ఫ్రెషర్స్ నియామకాల్లో వృద్ధి 13 శాతం దిగింది.