Top 10 Cars | దేశీయ ఆటోమొబైల్ రంగంలో రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2023 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 10.8 శాతం సేల్స్ పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో 3,34,790 కార్లు అమ్ముడైతే, గత నెలలో 3,70,786 కార్లు సేల్ అయ్యాయి.గత నెలలో జరిగిన 3.70 లక్షల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ 19,412 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది 16,889 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 15 శాతం గ్రోత్ నమోదైంది.
టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ రెండో స్థానానికి చేరుకున్నది. 2023 ఫిబ్రవరితో పోలిస్తే 65 శాతం సేల్స్ పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో 11,169 యూనిట్లు అమ్ముడైన టాటా పంచ్.. గత నెలలో 18,438 యూనిట్లు అమ్ముడైంది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆల్ ఎలక్ట్రిక్ పంచ్.ఈవీ సేల్స్ తో మొత్తం టాటా పంచ్ కార్ల విక్రయాలు పెరగడానికి కారణం.
గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే మారుతి సుజుకి బాలెనో సేల్స్ ఆరు శాతం తగ్గినా.. టాప్-10 కార్ల విక్రయాల్లో మూడో స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో 18,592 యూనిట్ల కార్లు అమ్ముడైతే, గత నెలలో 17,517 యూనిట్లు అమ్ముడయ్యాయి.నాలుగో, ఐదో స్థానాల్లోనూ మారుతి సుజుకి డిజైర్, బ్రెజా కార్లు నిలిచాయి. మారుతి డిజైర్ సేల్స్ ఆరు శాతం తగ్గి 15,837 యూనిట్లకు పరిమితమైంది. పెట్రోల్, సీఎన్జీ డ్రైవ్ ట్రైన్ బ్రెజా కార్ల విక్రయాలు గతేడాదితో సమానంగా కొనసాగాయి.
మారుతి సుజుకి ఎర్టిగా ఆరో స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరి సేల్స్‌తో పోలిస్తే 140 శాతం గ్రోత్ నమోదైంది. గతేడాది 6,472 కార్లు అమ్ముడైతే, గత నెలలో 15,519 కార్లు సేల్ అయ్యాయి. హ్యుండాయ్ మోటార్స్ క్రెటా 47 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. ఇటీవల ఆవిష్కరించిన క్రెటా ఫేస్ లిఫ్ట్ సాయంతో గత నెలలో 15,276 క్రెటా ఎస్యూవీ కార్లు అమ్ముడయ్యాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో సేల్స్ 117 శాతం పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో 6,950 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 15,051 కార్లు సేల్ అయ్యాయి.
టాటా మోటార్స్ నెక్సాన్ గతేడాదితో పోలిస్తే మూడు శాతం పుంజుకున్నది. 2023 ఫిబ్రవరిలో 13,914 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 14,395 యూనిట్లు విక్రయించింది. ఇక పదో స్థానంలో మారుతి సుజుకి బాలెనో బేస్డ్ ఎస్యూవీ ఫ్రాంక్స్ నెలవారీ సేల్స్ రీత్యా నాలుగు శాతం గ్రోత్ పెంచుకున్నది. గత జనవరి తరహాలోనే గత నెలలో 14,168 యూనిట్లు అమ్ముడయ్యాయి.