Gold @ Dhanteras | భారతీయులు.. అందునా మన మహిళామణులకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. ప్రతియేటా అక్షయ తృతీయ.. ధంతేరాస్ నాడు బంగారం కొంటే కుటుంబంలోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఇప్పుడు ఐదు రోజుల దీపావళి సంబురాల్లో తొలిరోజు ధంతేరాస్ ఈ దఫా శనివారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు. ధంతేరాస్ రోజు మాత్రమే కాదు దీపావళి నాడు కూడా బంగారం కొనుగోళ్లు ఎక్కువే ఉంటాయి. ఒకవేళ మీరు బంగారం నాణాలు లేదా ఆభరణాలు కొనాలనుకున్నా ఈ సప్త సూత్రాలు పాటించడం మరిచిపోవద్దు.. అవేంటో చూద్దామా.. !
బంగారం విక్రయించినా.. కొనుగోలు చేసినా మోసాల పాలవుతారని అంటారు. కానీ, కాసింత తెలివిగా, జాగరూకతతో వ్యవహరిస్తే బంగారం క్రయ, విక్రయాల్లో మోసానికి గురయ్యే అవకాశాలు తక్కువ. ఇక తప్పనిసరిగా సర్టిఫైడ్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తు ఉంచుకోవాలి. బంగారం నాణ్యతను, స్వచ్ఛతను తెలిపే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్ గల నగలు కొనడమే ఫస్ట్ ప్రియారిటీ కావాలి.
హాల్‌మార్క్‌లో బంగారం ప్యూరిటీని తెలిపే కోడ్, టెస్టింగ్ సెంటర్ మార్క్, జ్యువెలరీ మార్క్, హాల్‌మార్క్ ఎప్పుడు వేశారన్న డిటైల్స్ ఉంటాయి. స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేస్తే 24కే, ఆభరణాలు కొంటే 22కే అని హాల్‌మార్క్ ఉంటుంది. కొందరు 18కే ప్యూరిటీ బంగారం కొంటుంటారు. జ్యువెల్లరీ షాప్ యజమానులు చెప్పే స్వచ్ఛత లేదా ప్యూరిటీ.. హాల్మార్క్పైనా ఉండాలి.
బంగారం కొనుగోలు కోసం జ్యువెల్లరీ షాప్‌కు వెళ్లడానికి ముందుగా ఆన్లైన్లో ఒకసారి పుత్తడి ధరలు తెలుసుకోండి. 24 క్యారట్ల తులం బంగారం, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర వరలపై ఆరా తీయండి. ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి 22 క్యారట్ల రేటు వర్తిస్తుంది. కొన్ని జ్యువెల్లరీ షాప్‌ల నిర్వాహకులు 22 క్యారట్ల బంగారానికి 24 క్యారట్ల విలువ కట్టి రేట్ నిర్ణయిస్తారు. కనుక ముందే ధర తెలుసుకోవడం బెటర్‌గా ఉంటుంది.
బంగారం ఒక గ్రామ్ మాత్రమే కొన్నా, తులం కొన్నా బిల్లు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు. టాక్స్ పే చేయాల్సి వస్తుందని జీరో బిల్లుతో నగలు, ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల మోసపోయే అవకాశాలెక్కువ. అటువంటప్పుడు నగల షాపుల యజమానులను నిలదీయడానికి మీ వద్ద ఎటువంటి ఆధారాలు ఉండవు. కనుక ఒరిజినల్ ఇన్వాయిస్ తీసుకుంటే ఆభరణాల్లో ఏమాత్రం తేడాలు ఉన్నా.. సంబంధిత జ్యువెల్లరీ షాప్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయొచ్చు. అవసరమైతే ఆ బిల్లుతో ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో బంగారం కొన్నట్లయితే డెలివరీ తీసుకోకముందు పార్సిల్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.