Tata Punch | దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. అత్యధికంగా అమ్ముడయ్యే కార్లూ మారుతి సుజుకివే. సాధారణంగా టాప్-10 కార్లలో మారుతి సుజుకి మోడల్స్ ముందు వరుసలో నిలుస్తాయి. అరుదుగా హ్యుండాయ్.. టాటా మోటార్స్ నిలుస్తాయి. అలాగే మారుతి సుజుకి కాదని గత రెండు నెలలుగా అత్యధికంగా ఈ మోడల్ కారు అమ్ముడైంది. టాటా నెక్సాన్.. హ్యుండాయ్ క్రెటా అనుకుంటున్నారా..?! దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఆటో మేజర్ టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ కారు టాటా పంచ్.. గత రెండు నెలలుగా అత్యధికంగా అమ్ముడైన కార్లలో నిలిచింది.
గత మార్చిలో టాటా పంచ్ 17,547 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 19,158 కార్లు విక్రయించింది. టాటా పంచ్ కార్లలో ఇంటర్నల్ కంబుష్టన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) అవతార్ ఉన్నాయి. టాటా పంచ్ ఐసీఈ వర్సన్ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. ఈ కారు ఇంజిన్ 1.2 లీటర్ల రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వర్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఆప్షన్లోనూ (గరిష్టంగా 73 పీఎస్, 103 ఎన్ఎం టార్క్) 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ గ్యాస్ ఫ్యుయల్ కోసం రెండు ట్యాంకులతో వస్తోంది.
టాటా పంచ్.ఈవీ కారు ధర రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ స్టాండర్డ్ వేరియంట్ 60కిలోవాట్ల మోటార్ (114 ఎన్ఎం టార్క్)తోపాటు 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా పంచ్.ఈవీ 90 కిలోవాట్ల మోటార్ (190 ఎన్ఎం టార్క్), 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్రయాణించొచ్చు.
టాటా నెక్సాన్ మోడల్ కారుతో పోటీ పడి టాటా పంచ్ విక్రయాలు సాగుతున్నాయి. 2023-24లో 1,70,076 యూనిట్ల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇదే ఒరవడి కొనసాగితే 2024-25లో రెండు లక్షల మార్కును దాటేస్తుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ ఎక్స్టర్, రెనాల్ట్ కైగర్, నిసాన్ మ్యాగ్నైట్ వంటి మోడల్ కార్లకు టాటా పంచ్ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.