Home | ప్రతి ఒక్కరూ సొంతిల్లు కొనుక్కోవాలని ఆశిస్తుంటారు. కరోనా తర్వాత తమ ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సొంతింటి కల నిజం చేసుకుంటున్నారు. పెరిగిన ధరలు, సమయానికి పెరిగిన ప్రాధాన్యం పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఇంటి స్థలం కొని గూడు కట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన సంగతే. కుటుంబ అవసరాలూ ఆర్థిక వనరులను బట్టి ఇల్లు కొనాలి. అలా ఇల్లు కొనేటప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటంతోపాటు అన్ని విషయాలపై సమగ్ర పరిశీలన ఉండాలి.
సొంతింటి కల సాకారం చేసుకునే దశలో బడ్జెట్ చాలా కీలకం. ఇంటి అవసరాలు ఉన్నా, బడ్జెట్ అందుకు సహకరించకపోవచ్చు. ఇల్లు పెద్ద ఆస్తి కావడంతోపాటు భారీ ఖర్చుతో కూడుకున్నది. కనుక ఇల్లు కొనుగోలు బడ్జెట్ విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు పనిచేసే ప్రదేశానికి కాస్త దూరమైనా మీ బడ్జె్ట్ పరిమితిలో మంచి ఇల్లు చూసుకోవాలి. ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు దుబారా ఖర్చులకు కోత విధించాలి. ఇంటి కొనుగోలుకు బడ్జెట్ ముందే ఖరారు చేసుకోవడంతోపాటు దానికి కట్టుబడి ఉంటే.. మీకు ఆస్తిగా ఇల్లు మిగులుతుంది.
ప్రతి కుటుంబంలోని సభ్యులంతా విద్యా ఉద్యోగం కోసం బయటకు వెళ్లి వస్తారు. కనుక అందరూ బయటకు వెళ్లడంతోపాటు ఇంటికి కూడా వేగంగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తదనుగుణంగా ట్రాన్స్ పోర్ట్, స్కూళ్లు, మార్కెట్లు దగ్గర్లో ఉన్న ఇంటిని చూసుకోవాలి. అలాంటి ఇల్లు సౌకర్యవంతం కావడంతోపాటు మున్ముందూ దాని విలువ అధికంగా పెరిగిపోతుండవచ్చు. ఇంటి కొనుగోలుకు ముందు కొన్నేండ్లలో డెవలప్ అయ్యే ప్రాంతాన్ని పూర్తిగా స్టడీ చేసి నిర్ధారించాలి.
ఇల్లుతోపాటు వాటర్, విద్యుత్ వసతులు కూడా కీలకమే. వాటర్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్ సౌకర్యం గల ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ తమ సౌకర్యార్థం సొంతం చేసుకునే వెహికల్స్కు అనుగుణంగా పార్కింగ్ స్పేస్ ఉండేలా చూసుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఇంటికి మధ్యలో అవసరమైన మార్పులూ చేర్పులూ చేయొచ్చు. నిర్మాణం పూర్తయిన ఇంటిని చూస్తే అదనపు ఆకర్షణలు, లోటుపాట్లు తెలిసిపోవడంతోపాటు దాని కొనుగోలు చేయాలా? వద్దా అనే అంశం నిర్ణయానికి రావచ్చు.
ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు సంబంధిత డెవలపర్ క్రెడిబిలిటీని అంచనా వేయాలి.. వేర్వేరు బిల్డర్లు, ప్రాజెక్టులను పరిశీలించి, ఆయా ఇండ్ల ఓనర్లను విచారించిన తర్వాత ఓ నిర్ణయానికి రావచ్చు. ఇండ్ల నిర్మాణంలో వారి ట్రాక్ రికార్డు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మంచి పేరు ఉన్న బిల్డర్’ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయాలు ఉన్నాయి.
మీరు కొనుగోలు చేసే ఇంటికి రెరా రిజిస్ట్రేషన్ ఉంటే బెటరని నిపుణులు చెబుతున్నారు. రెరా వెబ్ సైట్లోకి వెళ్లి దాని స్టేటస్ చెక్ చేస్తే పూర్తి విషయాలు తెలుస్తాయి. రిజిస్టర్డ్ డెవలపర్లు ప్రతి మూడు నెలలకోసారి ఇండ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక అప్ డేట్ చేస్తూ ఉండాలి. నివేదికలు అప్ లోడ్ చేయని డెవలపర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటది.
ఇల్లు కొనుగోలుతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ కూడా పే చేయాలి. మీరు ఇల్లు కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు మారుతుంటాయి. ఆస్తి కొనుగోలు విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. దీనివల్ల పలు ఇబ్బందులు పరిష్కారం కావడంతోపాటు టైం కూడా కలిసి వస్తుంది. ఆస్తుల కొనుగోలుకు అవసరమైన చట్టాలు కూడా తెలుసుకోవాలి. ఆస్తి కొనుగోలు చేసినప్పుడు సేల్ డీడ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఫార్మాలిటీ పూర్తయ్యాక ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి ఆ ఇంటికి చట్టబద్ధంగా యజమాని అవుతారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సేల్ డీడ్ రిజిస్టర్ అవుతుంది. ఇంటి రుణం తీసుకున్నా, తిరిగి విక్రయించినా ఉపయోగపడుతుంది కనుక అత్యంత సేఫ్టీగా దాచి పెట్టుకోవాలి.