సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంత కష్టమైనా పడుతాం.. మరెంత బరువైనా మోస్తాం. అయితే ఇల్లు కట్టేటప్పుడు కొన్నింటిపై అవగాహన ఉండాలి. లేకపోతే తలకు మించిన భారమే అవుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకెళ్తే లక్ష్య సాధన కూడా సులువవుతుంది మరి.
బడ్జెట్ ప్లానింగ్
భూమి కొనుగోలు, ఆపై అందులో ఇంటి నిర్మాణం, దానికి కావాల్సిన అనుమతులు, కూలీల ఖర్చు, ఇంటీరియర్ ఫర్నీషింగ్స్ తదితరాలన్నింటికి అయ్యే ఖర్చును ముందే లెక్కించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో దేనికెంత వ్యయం అవుతుందన్నది తెలుసుకుని బడ్జెట్ వేసుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఆకస్మిక మార్పులేమైనా చేయాల్సి వస్తే దానికయ్యే వ్యయానికీ బడ్జెట్లో కేటాయించుకోవడం ఉత్తమం.
నిధుల సమీకరణ
బడ్జెట్ పూర్తయితే.. నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా దాచుకున్నది ఎంత? మనకున్న ఆదాయ మార్గాలు, వ్యయాలు ఏమిటి? అన్నది చూసుకోవాలి. వీలైతే బంగారం, ఇతరత్రా ఆస్తులను తీసేస్తే లాభమా? నష్టమా? అన్నదానిపైనా కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఓ నిర్ణయానికి రండి. ఇలా మొత్తం ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత.. రుణాల సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలి. ఎడాపెడా అప్పులు చేసినా వాటిని తీర్చలేక మొదటికే మోసం వచ్చే ప్రమాదముంటుందని గుర్తుంచుకోవాలి.
నిర్మాణ శైలి
ఇంటి నిర్మాణ శైలి, మెటీరియల్ ఎంపిక సైతం కీలకమే. ఖర్చును పెంచడంలో, తగ్గించడంలో ఇవి అంత ముఖ్యపాత్ర పోషిస్తాయి మరి. వీలైనంత వరకు హంగులు, ఆర్భాటాలకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్ప గృహ నిర్మాణంలో దేన్ని భాగం చేయవద్దు. ఫ్లోరింగ్, ఫిట్టింగ్స్ వంటివి మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైటింగ్, సోలార్ ప్యానెల్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వండి. నాణ్యమైన విద్యుత్తు వైరింగ్తోపాటు వెంటిలేషన్‌కు పెద్దపీట వేయండి. వీటివల్ల కరెంట్ చార్జీలను తగ్గించుకోవచ్చు.
కాంట్రాక్టర్ ఎంపిక
నమ్మకమైన కాంట్రాక్టర్‌ను ఎంచుకోవడం చాలాచాలా ప్రధానం. అనుకున్న సమయానికి మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కాంట్రాక్టర్‌దే కీలకపాత్ర. కాబట్టి ఈ విషయంలో అనుభవజ్ఞులు, మీ బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. వ్యయం, నాణ్యత విషయంలో క్రమశిక్షణ ఉండాలి. లీగల్‌గా కూడా కచ్చితత్వం కనిపించాలి.
పన్ను ప్రోత్సాహకాలు
గృహ నిర్మాణానికయ్యే ఖర్చుల్లో పన్ను మినహాయింపుల కిందకేమైనా వస్తాయా? అన్నదీ చూసుకోవాలి. మొదటిసారిగా ఇల్లు కడుతున్నవారికి ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వస్తుందా? అన్నదీ పరిశీలించాలి. వడ్డీరేట్ల తగ్గింపు, ఇతరత్రా పథకాల వర్తింపునకున్న అవకాశాలనూ అందిపుచ్చుకోవడం మంచిది.
చివరగా..
మీరు ఇల్లు నిర్మించాలనుకునే చోటు అన్నివిధాలా మీకు సరైనదేనా? అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. భవిష్యత్తులో అక్కడ ధరలు పెరుగుతాయన్న కోణంలోనేగాక, ప్రశాంతతకూ ప్రాధాన్యం ఇవ్వండి. ముంపు ప్రాంతాలు, లిటిగేషన్ ల్యాండ్లుంటే ఆరా తీయండి. ఇక ఆర్థిక ఇబ్బందులేవైనా ఉంటే అవి తీరాకే గృహ నిర్మాణం మొదలు పెట్టండి. లేకపోతే మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కొత్త సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.