న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.164 బిలియన్ డాలర్ల మేర తగ్గి 584.248 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 1.657 బిలియన్ డాలర్ల మేర పెరిగి 586.248 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన డాటా ప్రకారం ఏప్రిల్ 21తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో అధికశాతం వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.146 బిలియన్ డాలర్లు క్షీణించి 514.489 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
విదేశీ కరెన్సీ ఆస్తుల లెక్కింపులో..డాలర్ మారకంలో యూరో, పౌండ్, యెన్ల విలువ హెచ్చుతగ్గుల్ని సైతం పరిగణనలోకి తీసుకుంటారు. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 24 మిలియన్లు మేర తగ్గి 46.151 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 19 మిలియన్ డాలర్ల వరకూ పెరిగి 18.431 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆర్బీఐ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న భారత రిజర్వులు 14 మిలియన్ డాలర్ల మేర తగ్గి 5.176 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.