న్యూఢిల్లీ, జూలై 24 : దేశీయ స్టీల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా స్టీల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.525 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. ఏడాది క్రితం అందుకున్న రూ.7,714 కోట్ల లాభంతో పోలిస్తే 93 శాతం గండిపడిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.63,698 కోట్ల నుంచి రూ.60,666.48 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు రూ.51,912 కోట్ల నుంచి రూ.58,553.25 కోట్లకు పెరిగాయి.
సమీక్షకాలంలో కంపెనీ అప్పులు రూ.71,397 కోట్లకు చేరుకోగా, అలాగే 30,569 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గత త్రైమాసికంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరిగి 5 మిలియన్ టన్నులకు చేరుకున్నది. మూలధన వ్యయం కింద గత త్రైమాసికంలో 4,089 కోట్ల నిధులను ఖర్చుచేసింది. దేశీయంగా స్టీల్ డిమాండ్ 10 శాతం పెరిగింది.