సమీర్‌కు 42 ఏండ్లు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి పదేండ్లు, మరొకరికి ఏడేండ్లు. తల్లిదండ్రులిద్దరు కూడా తనపైనే ఆధారపడ్డారు. ఒకరోజు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో సమీర్ కన్నుమూశాడు. దీంతో తన కుటుంబమంతటికీ మనిషిలేని లోటేకాదు.. డబ్బుకు కూడా కటకట ఎదురైంది.
ఎందుకంటే నెలనెలా కట్టాల్సిన రూ.25 వేల ఈఎంఐతోపాటు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, కొంత అప్పు కూడా ఉన్నది. దీంతో ఆ ఇంటిల్లిపాదీదాదాపుగా రోడ్డునపడ్డ దుస్థితి. కొద్దోగొప్పో సేవింగ్స్ ఉన్నా.. అవేవీ పెద్దగా కుటుంబానికి సాయపడేంత సొమ్ము కూడా కాదు.
ఇదొక్క సమీర్ కుటుంబ పరిస్థితే కాదు.. ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా, ఎవ్వరికైనా జరగొచ్చు. చదవడానికి, వినడానికి ఇదంతా కాస్త ఇబ్బందిగా ఉన్నా.. కొన్ని వాస్తవాలను మనం జీర్ణించుకోవాల్సిందే. కరోనా దెబ్బతో ఏ ప్రాణానికి ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో తెలియకుండా ఉన్నది. నిజానికి ఇటీవలికాలంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్య బీమా, జీవిత బీమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మన తదనంతరం కూడా మనవాళ్లు మెరుగైన జీవితాన్ని కొనసాగించాలంటే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ ఓ మంచి మార్గం.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?
తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తం కవరేజీని పొందడం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రధాన లక్ష్యం. ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, ప్రాథమికమైన జీవిత బీమా. మనం ఒక నిర్దిష్ట కాలానికి బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తాం. అనుకోని సంఘటనలో బీమాదారు మరణిస్తే.. ఇన్సూరెన్స్ సంస్థ నామినీకి వాళ్ల ఒప్పంద మొత్తాన్ని అందజేస్తుంది. అయితే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. అంటే కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా బీమాదారు బతికి ఉంటే.. తనకు ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్ రాదు.
అవసరాలను గుర్తించి..
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రతీ ఒక్కరూ తప్పకుండా అవసరాలపై ఓ అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. మనం లేని రోజున మనవాళ్ల ఆదాయ, వ్యయాలు ఎలా? ఉంటాయన్నది ఊహించి ఓ అంచనాకు రావచ్చు. హ్యూమన్ లైఫ్ వాల్యూ, ఇన్‌కం రీప్లేస్మెంట్, ఎక్స్పెన్స్ రీప్లేస్మెంట్, అండర్‌రైటింగ్ రూల్స్ అనే నాలుగు పద్ధతుల్లో బీమా మొత్తం మనకు ఎంత అవసరం ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇందులో ఒక్కో విధానానికి పాజిటివ్, నెగిటివ్ అనే రెండు అంశాలూ ఉంటాయి. ఇక సులువైన పద్ధతిలో లెక్కించి చూసుకోవాలంటే మన వార్షిక వేతనానికి కనీసం 10-15 రెట్ల బీమా అవసరం. అంటే మీకు ఏడాదికి రూ.6 లక్షల వేతనం వస్తోందని అనుకుంటే.. కనీసం రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అమ్మో.. ఇంత ఇన్సూరెన్స్ అవసరమా అనుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పు.
-నాగేంద్ర సాయి
మనం లేని కుటుంబం మాటేంటి?
టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం వాస్తవానికి ప్రీమియం చెల్లింపుదారు పొందరు. ఎందుకంటే వాళ్లు మరణించిన తర్వాత కుటుంబం ఎలాంటి ఇబ్బందులూ పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ బీమా తీసుకుంటారు కాబట్టి. అలాంటప్పుడు ఎంత మొత్తం అవసరం ఉంటుందో మనం లెక్కించుకోవాలి. కుటుంబ బాధ్యతలు, ఏవైనా అప్పులు, గృహ-వాహన రుణాలు, పిల్లల చదువులు-పెళ్లిళ్లు.. ఇలా వివిధ అవసరాలకు ఈ మొత్తం సరిపోవాలి. అంతేకానీ.. పది లక్షలో, పాతిక లక్షలో ఏదో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని మమ అనిపించవద్దు. ఎందుకంటే.. మనం లేని లోటు కుటుంబానికి ఎవరూ తీర్చలేరు. కనీసం మన ప్లానింగ్తోనైనా బీమా సంస్థ సమకూర్చిన డబ్బు.. వాళ్లకు ప్రశాంత జీవితాన్ని ఇచ్చేలా చూడటం మంచిది.
గుర్తుంచుకోండి
చిన్న వయస్సులోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి.
కుటుంబం, బాధ్యతలు పెరుగుతున్నకొద్దీ కవరేజీని సమీక్షించుకోండి.
రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడుతున్నప్పుడు అంత భారీ మొత్తంలో కవరేజీ అవసరం ఉండకపోవచ్చు.
ముఖ్యంగా 30 నుంచి 50 ఏండ్ల మధ్య టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎక్కువగా ఉండటం చాలా అవసరం.
అన్వేషిస్తే ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో చౌకగానే మీరు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు.