సరదాగా గడపాలని కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తే అక్కడ మీ పాస్‌పోర్ట్ పోతే.. కనెక్టింగ్ విమానం మిస్సైతే.. మీ పిల్లలకు ఉన్నట్టుండి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి దవాఖానలో చేర్చాల్సివస్తే.. ఆనందం కాస్తా ఆవిరైపోతుంది కదూ. పైగా ఊహించనంత ఆర్థిక భారాన్నీ మోయాల్సి వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఊరటనిచ్చే పరిష్కారమే ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్).
తప్పనిసరే..
కొన్ని దేశాలు వీసా ఇవ్వాలంటే తప్పకుండా ప్రయాణ బీమా ఉండాలనే నిబంధనను పెడుతున్నాయి. కరోనా సమయంలో దాదాపుగా అన్ని దేశాలూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశాయి. ఈ మధ్య కొద్దిగా నిబంధనలను సడలించినప్పటికీ మనం మాత్రం రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ మహమ్మారి ఎప్పుడు, ఏవైపు నుంచి ముంచుకొస్తుందో తెలియని దుస్థితిలో ఉన్నామిప్పుడు. కాబట్టి తమ దేశ పౌరులను, ఇతర దేశాల పర్యాటకులను ఇబ్బంది పెట్టకుండా ప్రయాణ బీమాను తప్పనిసరి చేస్తూ మున్ముందు అన్ని దేశాలు ఓ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి.
భరోసాగా ఉండొచ్చు
పాస్‌పోర్ట్ పోయినా, క్రెడిట్ కార్డులు మాయమైనా, మీ ట్రావెల్ లగేజీని ఎయిర్‌లైన్ సంస్థలు ఎక్కడైనా పోగొట్టినా, మీరు అనారోగ్యం బారినపడినా.. మీకు ప్రయాణ బీమా సహాయకారిగా నిలుస్తుంది. కొన్ని సంస్థలు మీకు పోయిన పాస్‌పోర్ట్‌ను పొందే సహాయాన్ని అందించడంతోపాటు అక్కడ హోటల్ వసతిని కూడా కల్పించి, తిరిగి మన దేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన సర్వీసును కూడా అందిస్తాయి. అలాగే క్రెడిట్ కార్డ్ పోయినప్పుడు వాటిని బ్లాక్ చేయించడం, దవాఖాన బిల్లులు సెటిల్ చేయడం వంటి బాధ్యతనూ నెత్తినేసుకుంటాయి. ఎందుకంటే విదేశాల్లో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
భారంగా అనుకోవద్దు
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫైరింజన్ లాంటిది. అగ్ని ప్రమాదంలో మొత్తం బూడిదపాలు కాకుండా ఉపయోగపడుతుంది. ఇందుకు మనం చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించాలి అంతే. మనం పెట్టే ట్రావెల్ ఖర్చులో ఇది గోరంతే. కానీ ఇదిచ్చే భరోసా కొండంత. తీసుకునే పాలసీలో కరోనా కవరేజీ ఉందో.. లేదో.. చెక్ చేసుకోవడం మంచిది. అంతేగాకుండా మీరు వెళ్లే దేశం ఏది? అక్కడ వైద్య ఖర్చులు ఎంత ఉంటాయి? అనే అంశాన్ని కూడా బేరీజు వేసుకుని కవరేజీని తీసుకోవడం మర్చిపోవద్దు.
ఎంత చెల్లించాలి?
సాధారణంగా లక్ష డాలర్ల పాలసీ కవరేజీకి, 15 రోజుల ప్రయాణం కోసం ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు ఫ్యామిలీ ఫ్లోటర్ కింద రూ.4,500-6,000 మధ్య ప్రీమియం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న మొత్తం కోసం మనం అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అని ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏదైనా ముందస్తు అనారోగ్య సమస్యలుంటే వాటిని పాలసీ తీసుకునే సమయంలో తప్పక వెల్లడించాలని మాత్రం మర్చిపోవద్దు.
–నాగేంద్ర సాయి కుందవరం
కుటుంబమంతటికీ..
ఒక్కోసారి వివిధ కారణాలతో కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కావడమో, అనారోగ్యరీత్యా మొత్తం ప్రయాణాన్నే వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఇది చాలా ఖర్చుతో కూడుకుంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి ఫ్లెక్సీ టికెట్ తీసుకోకపోతే ప్రయాణ తేదీలను మార్చుకోలేం. అప్పుడు విమాన చార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రయాణ బీమా ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థలు భరిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తరహాలో ఇందులో కూడా మొత్తం కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు లక్ష డాలర్లకు ఫ్లోటర్ పాలసీని తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ దీన్ని వాడుకోవచ్చు. అలా కాకుండా మల్టీమెంబర్ పాలసీని తీసుకుంటే ఒకొక్కరు లక్ష డాలర్లను అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. దీనికి సింగిల్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయితే షెంజెన్ దేశాలు ఫ్లోటర్ పాలసీని అంగీకరించవు కాబట్టి అందుకు తగ్గట్టు మీ ప్రణాళిక ఉండాలి. విదేశాలకు తరచూ ప్రయాణించే వారు, వ్యాపారస్తులు ఈ మధ్య గ్లోబల్ హెల్త్ కవరేజీని తీసుకుంటున్నారు. ఇది ట్రావెల్ బీమా కంటే కాస్త భిన్నంగా, సాధారణ ఆరోగ్య బీమాకు దగ్గరగా ఉంటుంది. విదేశాల్లో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.