Silicon Valley Bank | అమెరికాలోనే పెద్దదైన సిలికాన్ వ్యాలీ బ్యాంకు 48 గంటల్లోనే ఎందుకు మూతపడింది?
Silicon Valley Bank | అమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి బీజం పడింది గత వారమే. ఎస్వీబీ క్రెడిట్ డౌన్‌గ్రేడ్ చేయనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్... ఎస్వీబీ మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్‌నకు ఆందోళనకరమైన వార్తని చేరవేసింది.
Silicon Valley Bank | కాలిఫోర్నియా, మార్చి 11: అమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి బీజం పడింది గత వారమే. ఎస్వీబీ క్రెడిట్ (రుణ పత్రాలు, బాండ్లు) డౌన్‌గ్రేడ్ చేయనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్… ఎస్వీబీ మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్‌నకు ఆందోళనకరమైన వార్తని చేరవేసింది. మూడీస్ నుంచి ఆ ఫోన్‌కాల్‌తో వెనువెంటనే జరిగిన పరిణామాలు 2008 లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్ దివాళాకు కారణమయ్యాయి. ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అందించిన వివరాలివి…
- అధిక వడ్డీ రేట్ల కారణంగా ఎస్వీబీ పెట్టుబడి చేసిన ట్రెజరీ, కార్పొరేట్ బాండ్ల విలువలు (బ్యాంక్ ఆస్తులు) పడిపోయాయి. దాంతో ఎస్వీబీ చెల్లింపు సామర్థ్యం తగ్గుతుందన్న అంచనాలతో అది జారీచేసిన రుణపత్రాలు, బాండ్లను డౌన్‌గ్రేడ్ చేయనున్న కాల్ మూడీస్ నుంచి అందింది.
- డౌన్‌గ్రేడ్ అయితే బ్యాంక్ ఆర్థిక ఆరోగ్యం పట్ల తమ ఇన్వెస్టర్లు, ఖాతాదారుల విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళనతో ఎస్వీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ బెకర్ బృందం సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్‌ను సంప్రదించింది. మూడీస్తోనూ, ఇతర రేటింగ్ ఏజెన్సీలతో సమావేశాలు జరిపేందుకు న్యూయార్క్ తరలివెళ్లింది.
- సలహాలు, సూచనలు పొందిన మీదట తన ఆస్తుల విలువను పెంచుకునే దిశగా గత వారాంతంలో ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. తక్కువ రాబడినిచ్చే 20 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విక్రయించి, ఈ డబ్బును అధిక ఆదాయాన్ని అందించే ఆస్తుల్లో తిరిగి పెట్టుబడి చేయాలన్నది ఆ ప్రణాళిక.
- అయితే ఈ లావాదేవీ తాత్కాలికంగా బ్యాంక్‌కు నష్టం తెచ్చిపెడుతుంది. తన షేర్ల విక్రయంతో నిధులు సమీకరించడం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకుని, డౌన్గ్రేడ్ను తప్పించుకోవచ్చన్నది ఎస్వీబీ యోచన.
- ఈ వారమే మూడీస్ డౌన్‌గ్రేడ్ ముంచుకొస్తుందన్న విషయం తెలుసుకున్న ఎస్వీబీ అధికారులు హుటాహుటిన 2.25 బిలియన్ డాలర్ల షేర్ల విక్రయానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో 500 మిలియన్ డాలర్ల షేర్లను కొనేందుకు జనరల్ అట్లాంటిక్ ముందుకు వచ్చింది. మరో పెద్ద ఇన్వెస్టరు ఎస్వీబీ కోరుకున్నంత త్వరితంగా ఇన్వెస్ట్ చేయలేమని చెప్పారు.
- బుధవారం (మార్చి 8)కల్లా 1.8 బిలియన్ డాలర్ల నష్టానికి ఎస్వీబీ బాండ్ పోర్ట్‌ఫోలియోను విక్రయించారు.
- షేర్ల అమ్మకం వార్త వెలువడితే ఆ షేర్లు క్షీణిస్తాయన్న ఉద్దేశంతో గురువారం (మార్చి 9) స్టాక్ మార్కెట్ ప్రారంభం కాకముందే షేర్ల విక్రయాన్ని పూర్తిచేయాలని ఎస్వీబీ భావించింది.
- కానీ ఇటువంటి భారీ డీల్‌కు తగిన విధంగా ఎస్వీబీ సిద్ధం కాలేకపోయింది. బ్యాంక్ కొత్త ఫైనాన్షియల్ అంచనాల్ని ఇన్వెస్టర్లు అవగాహన చేసుకుని, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడానికి కనీసం 24 గంటలు అవసరం ఉంటుందని లాయర్లు ఎస్‌వీబీకి సూచించారు.
- బ్యాంక్ షేర్ల విక్రయంపై వార్త దానావలంలా వ్యాపించడంతో గురువారం ఎస్వీబీ బ్యాంక్ షేరు 60 శాతం కుప్పకూలి 106 డాలర్ల వద్దకు పడిపోయింది. అయినప్పటికీ 95 డాలర్ల ధరతో షేర్ల విక్రయాన్ని పూర్తిచేయగలమన్న నమ్మకంతో గోల్డ్‌మాన్ శాక్స్ బ్యాంకర్లు ఉన్నారు.
- ఇదే సమయంలో ఎస్వీబీలో నగదును విత్‌డ్రా చేసుకోమ్మంటూ వివిధ స్టార్టప్‌లకు వీసీ సంస్థలు సూచించాయి. ఒక్కరోజులోనే బ్యాంక్ నుంచి 42 బిలియన్ డాలర్ల డబ్బును విత్‌డ్రా చేసుకోవడంతో బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్‌లోకి వెళ్లింది.
- దీంతో జనరల్ అట్లాంటిక్, ఇతర ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు గుడ్‌బై చెప్పారు.
- శుక్రవారం కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు ఎస్వీబీని మూసివేసి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను రిసీవర్‌గా నియమించారు.
ఎస్వీబీ మస్క్ ఆసక్తి
కొద్ది నెలల క్రితం ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ఎస్వీబీ ఆస్తుల్ని విక్రయించడానికి అమెరికా రెగ్యులేటర్లు రిసీవర్‌ను నియమించిన నేపథ్యంలో ‘ఎస్వీబీని ట్విట్టర్ కొనుగోలు చేసి, దానిని డిజిటల్ బ్యాంక్‌గా మార్చే ఆలోచన చేయాలి’ అంటూ రాజేర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ ట్వీట్ చేశారు. అందుకు బదులుగా మస్క్ స్పందిస్తూ అటువంటి అలోచనను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
దేశీయ స్టార్టప్‌లకు షాక్
అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ప్రత్యేక సంస్థగా పేరొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేతకు గురికావడంతో భారత్‌లోని స్టార్టప్ సమాజం షాకయ్యింది. ఎస్వీబీ ఖాతాదారుల్లో సాఫ్ట్వేర్ యూనీకార్న్లు, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీలు ఉన్నాయి. చాలావరకూ సాస్ కంపెనీలు భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇంటర్నెట్ ద్వారా సర్వీస్ రూపంలో అప్లికేషన్లను డెలివరీ చేస్తుంటాయి. కానీ అవి యూఎస్‌లో రిజిష్టర్ అయ్యేందుకు మొగ్గుచూపుతుంటాయి.
ఎందుకంటే అక్కడ రిజిష్టర్ అయితే అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేరువ కావొచ్చని, యూఎస్ వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి నిధులు లభిస్తాయన్నది ఆశ. వాటిలో పలు సంస్థలు ఎస్వీబీ ఆర్థిక సహకారం పొందుతున్నవే. డిపాజిట్లు కలిగి ఉన్నవే. వాటికి ప్రత్నామ్నాయ అమెరికా బ్యాంక్ ఖాతా ఏదీ లేనందున, ఇప్పుడు ఎస్వీబీ నుంచి నిధుల్ని వేగంగా బదిలీ చేసుకోలేని ఇబ్బందుల్లో పడ్డాయి.
ఆ బ్యాంక్ నుంచి త్వరితంగా డబ్బు బదిలీ చేసుకోకపోతే రిసీవర్ ఆస్తులు విక్రయించేంతవరకూ నిధులు ఫ్రీజ్ అవుతాయని సీడ్ ఇన్వెస్టర్ ష్రిష్టి సాహు హెచ్చరించారు. 21 భారతీయ స్టార్టప్‌ల్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పెట్టుబడులున్నట్టు ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ట్రాక్సన్ డాటా వెల్లడిస్తున్నది. పూనెకు చెందిన యూనీకార్న్ ఐసెర్టిస్‌లో ఎస్‌వీబీకి పెద్ద పెట్టుబడి ఉంది. ఈ ఆర్థిక సహకారాన్ని రివాల్వింగ్ క్రెడిట్ లైన్, కన్వర్ట్‌బుల్ ఫైనాన్సింగ్ రూపంలో ఎస్వీబీ అందిస్తున్నది. మరోవైపు అమెరికా బ్యాంక్‌ల నుంచి ఇండియాకు వేగంగా నిధులు తీసుకొచ్చే సహాయం చేయడానికి ఫిన్‌టెక్ సంస్థ రేజర్ పే ఒక ప్రత్యేకమైన డెస్క్ నెలకొల్పింది.
కొద్ది శాతానికే డిపాజిట్ ఇన్సూరెన్స్
ప్రస్తుతం ఎస్వీబీ వద్ద 175 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని అంచనా. అందులో 89 శాతానికి బీమా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2.50 లక్షల డాలర్ల డిపాజిట్లకే ఇన్సూరెన్స్ ఉంటుంది. మార్చి 13న బ్యాంక్ శాఖలన్నింటినీ తెరుస్తామని ఇన్సూరెన్స్ కలిగిన డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అమెరికా రెగ్యులేటర్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

