న్యూఢిల్లీ : సెర్చింజన్ దిగ్గజం గూగుల్ రెండు వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే గూగుల్ ఏకంగా 10,000 మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది రాబోయే క్వార్టర్లలో నియామకాల ప్రక్రియ మందకొడిగా సాగుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించిన కొద్దిరోజులకే హైరింగ్ ప్రక్రియ నిలిపివేతపై గూగుల్ నిర్ణయం వెలువడటం గమనార్హం.
హైరింగ్ ప్రక్రియ నెమ్మదించిన కీలక రోల్స్‌లో ఇంజనీర్లు, ఉద్యోగుల హైరింగ్ పునరుద్ధరిస్తామని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో పిచాయ్ పేర్కొన్నారు. ఇక రెండు వారాల పాటు హైరింగ్ ప్రక్రియ నిలిపివేసి ఆ సమయంలో తమ హెడ్‌కౌంట్ అవసరాలు, రాబోయే మూడు నెలల్లో ఏయే విభాగాల్లో సిబ్బంది ఆవశ్యకత ఉందనే అంశాలను మదింపు చేస్తామని గూగుల్ పేర్కొంది.
ఇప్పటికే ఆఫర్లు అందుకున్న అభ్యర్ధులపై హైరింగ్ ప్రక్రియ నిలిపివేత ప్రభావం ఉండకపోయినా కాంట్రాక్టు పొడిగింపును కోరే ఉద్యోగులకు ఇది ఇబ్బందికరమేనని చెబుతున్నారు. గత ఏడాది చివరి క్వార్టర్‌తో పాటు ప్రస్తుత క్వార్టర్లో తాము వార్షిక టార్గెట్‌ను అధిగమించిన క్రమంలో హైరింగ్ ప్రక్రియను నెమ్మదించామని గూగుల్ పేర్కొంది.