న్యూఢిల్లీ, జూన్ 2: బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. తక్షణమే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఐఎల్‌ఐసీ) ఆస్తులతోపాటు దానికి చెందిన దాదాపు 2 లక్షల పాలసీల బాధ్యతను తీసుకోవాలంటూ శుక్రవారం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సూచించింది. ఎస్‌ఐఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న దృష్ట్యా సమావేశమైన ఐఆర్డీఏఐ.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
కాగా, ఆర్థిక పరిపుష్ఠితో దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటిగా ఉన్నందునే ఎస్బీఐ లైఫ్‌ను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేసినట్టు ఈ సందర్భంగా తమ ఆదేశాల్లో ఐఆర్డీఏఐ తెలియజేసింది. అలాగే ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కావాల్సిన చర్యలను కూడా తీసుకుంటామని చెప్పింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది. ఇక ఈ మొత్తం సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్సైట్లో పెట్టాలని ఎస్బీఐ లైఫ్‌ను ఐఆర్డీఏఐ ఆదేశించింది.