Rupee Vs US Dollar | ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌పై రూపాయి మారకపు విలువ పతనం ఎంతమాత్రమూ ఆగనంటున్నది. సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి మరో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 79.24 నుంచి 79.50 మధ్య తచ్చాడిన రూపాయి చివరకు 79.45 వద్ద సెటిలైంది. ఇంతకుముందు ముగిసిన ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి మారకం విలువ 79.26 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, మార్కెట్లో డాలర్‌కు విస్తృత స్థాయిలో డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడంతో రూపాయి బక్కచిక్కడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్ల్లోనూ పతనం కావడం గమనార్హం.
దేశీయంగా గత నెలలో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 25.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. దీని ప్రభావం డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనానికి దారి తీసిందని రెలిగేర్ బ్రోకింగ్ కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 86.61 పాయింట్ల పతనంతో 54,395.23 పాయింట్లకు.. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 4.60 పాయింట్లు నష్టపోయింది.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ధర 1.43 శాతం పతనమై బ్యారెల్ క్రూడాయిల్ ధర 105.49 డాలర్లుగా నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం రూ.170.51 కోట్ల విలువైన ఈక్విటీలు విక్రయించారు. ఈ నెలలో ఇప్పటికే రూ.4000 కోట్లకు పైగా విలువ గల షేర్లను అమ్మేశారు. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో షేర్ల విక్రయానికి ప్రాధాన్యం ఇచ్చారు.