Rupee Vs Dollar | రూపాయి బేల చూపులు చూస్తున్నది. వరుసగా నాలుగో సెషన్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనమైంది. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయి పతనం అవుతూనే ఉన్నది. సోమవారం మరో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి రికార్డు సృష్టించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 58 పైసలు పతనమై రూ.81.67 వద్ద స్థిర పడింది. శుక్రవారం ట్రేడింగ్‌తో పోలిస్తే సోమవారం రూ.81.47 వద్ద మొదలైన ట్రేడింగ్.. ఆ వెంటనే రూ.81.52 వద్దకు పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ ముగింపులో రూపాయి 30 పైసల పతనంతో రూ.81.09 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో రూపాయి 193 పైసలు పతనమైంది.
రూపాయి విలువ పతనం అవుతుందని అనుమానించిన ఆర్బీఐ జోక్యం చేసుకుంది. ఫారెక్స్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 81.50-81.55 మధ్య తచ్చాడింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను ఆర్బీఐ విక్రయించింది. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని అంచనా వేశామని హెచ్డీఎఫ్సీ ఆర్థిక వేత్తలు తెలిపారు. డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.82లకు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.