Shock for Jio | టెలికం సంచలనం రిలయన్స్ జియోకు సెప్టెంబర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబర్లో జియో నెట్వర్క్ 1.9 కోట్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇప్పటికే నష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా 10.8 లక్షల కస్టమర్లను నష్టపోయింది. దీనికి భిన్నంగా భారతీ ఎయిర్టెల్కు కొత్తగా 2.75 లక్షల యాక్టివ్ యూజర్లు జత కలిశారని ట్రాయ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదే నెలలో వొడాఫోన్ ఐడియా 10.7 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇది వరుసగా 11వ నెల కూడా వొడాఫోన్ తన కస్టమర్లను నష్టపోయింది. కానీ, ఎయిర్టెల్ వైర్లెస్ సబ్స్క్రైబర్లలో 0.08 శాతం మార్కెట్ వాటా పొందితే, జియో యూజర్ బేస్ 4.29 శాతం తగ్గింది. మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్లు 1.18 బిలియన్ల నుంచి సెప్టెంబర్ నాటికి 1.16 బిలియన్లకు పడిపోయింది. సెప్టెంబర్లో మొత్తం వైర్లెస్ కస్టమర్లు 1.74 శాతం తగ్గాయి.