Reliance on Revlon | ప్రముఖ కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా అమెరికాకు చెందిన కాస్మోటిక్స్ సంస్థ రెవ్లాన్ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దివాళా తీసినట్లు యూఎస్ రెగ్యులేటరీ సంస్థల ముందు రెవ్లాన్ పిటిషన్ దాఖలైన తర్వాత దాన్ని టేకోవర్ చేయడానికి రిలయన్స్ ముందుకు రావడం గమనార్హం. ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతోపాటు గ్లోబల్ సప్లయ్ చైన్లో అంతరాయం, రుణ బకాయిలు చెల్లించాలని రుణ దాతలు డిమాండ్ చేయడంతో రెవ్లాన్ యాజమాన్యం ఈ వారం ప్రారంభంలో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పటికే ఆయిల్ బిజినెస్, టెలికం రంగాల్లో ముందు వరుసలో ఉన్న రిలయన్స్.. అన్ని రంగాల్లోకి విస్తరించడానికి ఇటీవల కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. రిటైల్, దుస్తులు, ఈ-కామర్స్ తదితర రంగాల్లోకి విస్తరించిన రిలయన్స్ తాజాగా ఫ్యాషన్, పర్సనల్ కేర్ రంగంలోకి ఎంటర్ కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
రిలయన్స్ టేకోవర్ చేస్తుందన్న వార్తలు రావడంతో ప్రీమార్కెట్ ట్రేడ్లో రెవ్లాన్ షేర్లు 20 శాతం పెరిగి .236 డాలర్లకు చేరాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రిలయన్స్ షేర్ 1.9 శాతం వృద్ధి చెందింది. దీనిపై స్పందించేందుకు రిలయన్స్ గానీ, రెవ్లాన్ గానీ అందుబాటులోకి రాలేదు.