Personal Finance | వారసులకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే.. అప్పులు పంచొద్దు అంటే ఇలా చేయండి!
Personal Finance |మన పిల్లలు ‘ఇది నాన్న ఇల్లు’, ‘ఇది నాన్న కారు’.. అని సగర్వంగా చెప్పుకోవాలే కానీ.. ‘ఇది నాన్న బకాయిపడిన క్రెడిట్‌కార్డు బిల్లు’, ‘ ఇది నాన్న ఎగ్గొట్టిన పర్సనల్ లోన్' అంటూ తిట్టుకునే పరిస్థితి ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా, మన అప్పులు మనమే తీర్చేయాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
Personal Finance |మన పిల్లలు ‘ఇది నాన్న ఇల్లు’, ‘ఇది నాన్న కారు’.. అని సగర్వంగా చెప్పుకోవాలే కానీ.. ‘ఇది నాన్న బకాయిపడిన క్రెడిట్‌కార్డు బిల్లు’, ‘ ఇది నాన్న ఎగ్గొట్టిన పర్సనల్ లోన్’ అంటూ తిట్టుకునే పరిస్థితి ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా, మన అప్పులు మనమే తీర్చేయాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
రాంబాబు మధ్యతరగతి జీవి. వనస్థలిపురంలో అద్దె ఫ్లాట్. బంజారాహిల్స్‌లో ఆఫీసు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. ఇంటికి ఎంతోకొంత పంపాలి. ఆస్తులు కొనకున్నా, అప్పులు చేయకుండా బతికితే చాలనుకునే మనస్తత్వం. అంతలోనే తండ్రి మరణ వార్త. హుటాహుటిన ఊరికి వెళ్లాడు. అంత్యక్రియలు, దశదినకర్మ, అన్నదానాలకు ఉన్నంతలో ఖర్చు చేశాడు. తిరుగుప్రయాణానికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తూ ఉండగా.. ఇద్దరు అపరిచితులు ఇంటిముందు వాలారు. తాము ఫలానా బ్యాంకు క్రెడిట్‌కార్డు విభాగం ఉద్యోగులమని చెప్పారు. ‘మీ నాన్నగారికి మా బ్యాంకు క్రెడిట్‌కార్డు ఉండేది. రెండేళ్ల నుంచీ అసలు, వడ్డీ బకాయి పడిపోయింది. ఆయన మరణించారు కాబట్టి, చెల్లించాల్సిన బాధ్యత మీదే’ అని కాఫీ తాగుతూ తాపీగా చెప్పారు. కప్పులో చిక్కుకున్న ఈగ పరిస్థితి రాంబాబుది. అవుననలేడు. కాదనలేడు. అంత డబ్బు తానెక్కడి నుంచి తెస్తాడు? ఆస్తులమ్మేసి తీరుద్దామా అంటే.. పల్లెలోని కొంప కూడా సొంతం కాదు. వాటాలు వేసుకుని వదిలించుకోడానికి తోబుట్టువులు కూడా లేరు. భర్త కష్టం చూడలేని ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకుంది. కన్నతల్లి మనసులోనే
కుమిలిపోయింది. వెంకట్రావు ఉదాహరణ కూడా ఇలాంటిదే. జూదానికి అలవాటు పడిపోయిన తండ్రి కుటుంబాన్ని అప్పుల కుప్పల్లో వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. రుణదాతలు, క్రెడిట్‌కార్డు కంపెనీవారు వెంకట్రావు ఇంటిమీద పడ్డారు. శాపనార్థాలు, హెచ్చరికలు, నోటీసులు.. ఆ ఒత్తిడికి ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైంది.
తీర్చాల్సిందేనా?
కన్నవారి అప్పులకు పిల్లలు ఎంత వరకు బాధ్యులు అనేది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. తండ్రి లేదా తల్లి పిల్లల అనుమతితోనో, పిల్లల పూచీకత్తుతోనో అప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే మాత్రం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిందే. స్వయంగా పిల్లలే సహ-రుణగ్రహీతలు అయినప్పుడు కూడా తప్పించుకోలేని పరిస్థితి. కొడుకులు, మనవళ్లు, మునిమనవళ్లు.. ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ కొన్నిసార్లు ‘అప్పులు
తీరకపోతే పెద్దల ఆత్మ శాంతించదు. మీకు మంచి జరగదు. ఆ తర్వాత మీ ఇష్టం’ అంటూ రుణదాతలు వారసుల్ని ఎమోషనల్‌గా దారికి తెచ్చుకుంటారు. దీంతో, బాధ్యత తీసుకుంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చేస్తారు కొంతమంది. అదే కనుక జరిగితే, ఆరునూరైనా చెల్లించాల్సిందే. ఇంటినో, పొలాన్నో తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను తనఖా రుణాలు లేదా సెక్యూర్డ్ లోన్స్ అంటారు. నిర్ణీత వ్యవధిలో ఆ అప్పు తీరకపోతే.. కోర్టు జోక్యంతో జప్తు చేసి, వేలం వేసి బకాయిలను రాబట్టుకునే హక్కు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, వ్యక్తిగత రుణదాతలకూ ఉంటుంది.
అప్పు తీరగా మిగిలిన వేలం సొమ్మును చట్టపరమైన వారసులకు ఇచ్చేస్తారు. వారసులకు ఆస్తులు నిలుపుకొనే ఉద్దేశం ఉంటే.. సంబంధితులతో మాట్లాడి సెటిల్ చేసుకోవడమే మార్గం. ఏ పూచీకత్తూలేని వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డు చెల్లింపుల విషయంలో మాత్రం వారసుల్ని వేధించడం అనైతికం. కాకపోతే, ఆ సంస్థలు కోర్టులను ఆశ్రయించినప్పుడు మాత్రం, విషయం న్యాయస్థాన పరిధిలోకి వెళ్తుంది. అంతిమ తీర్పును
ఇరువర్గాలూ శిరసావహించాల్సి ఉంటుంది. ఆదాయపన్ను బకాయిలు మాత్రం చెల్లింపుదారు మరణంతో పూర్తిగా రద్దయిపోతాయని గత అనుభవాలు చెబుతున్నాయి.
అప్పులకు బీమా
మనం లేకపోయినా మన జీవితబీమా సొమ్ముతో మన కుటుంబం నిశ్చింతగా బతికేయాలి. అప్పులేవైనా మిగిలి ఉంటే.. నయాపైసాతో సహా తీర్చేయగలగాలి. సాధ్యమైనంత ఎక్కువ మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. దాదాపు అన్ని బ్యాంకులూ గృహరుణంలాంటి పెద్ద అప్పులకు అనుబంధంగా వివిధ బీమా సంస్థల నుంచి ఆ రుణ మొత్తానికి సమానమైన టర్మ్ పాలసీ ఇప్పిస్తున్నాయి. దీనివల్ల, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. బీమా సొమ్మును లోన్ అకౌంట్‌కు జమ చేసుకుంటారు. ఫలితంగా కుటుంబానికి ఆర్థిక బాధ్యత ఉండదు, బ్యాంకు మీద బరువూ పడదు. అప్పు తీసుకునే సమయానికి ప్రీమియం మొత్తం బరువుగా అనిపించవచ్చు. అనవసరమేమో అన్న భావనా కలగవచ్చు. కానీ, ఈ నిర్ణయం దీర్ఘకాలంలో భరోసా ఇస్తుంది. ‘ప్రతి రుణానికి ఒక టర్మ్ పాలసీ’.. సూత్రమూ అనుసరించదగినదే. ఏ కారణంతో అప్పు చేసినా సరే.. ఆ రుణ మొత్తానికి సమానంగా టర్మ్ పాలసీ తీసుకోవడం మంచి ఆర్థిక అలవాటు. దీనివల్ల వారసులు ఇబ్బంది పడరు. తీర్చగలిగే స్తోమత ఉంటే.. ఆస్తుల్ని తెగనమ్మి అయినా వదిలించుకునే అవకాశం ఉంటే.. రుణబంధాన్ని తెంచుకోవడమే న్యాయం, నైతికం. అదే సమయంలో.. తాను చేయని అప్పును నెత్తినేసుకుని భార్యాపిల్లల్ని వీధిపాలు చేయడమూ మంచిది కాదు. మన పెద్దల సంగతి ఎలా ఉన్నా.. మనమూ ఇలాంటి పెద్ద తప్పు చేయకూడదు. వీలైతే, ఎన్నోకొన్ని ఆస్తులు వదిలిపోవాలే కానీ, వారసుల్ని అప్పుల్లో ముంచేసి మన మానాన మనం అనంత లోకాలకు ప్రయాణం కాకూడదు. పిల్లల్ని ప్రేమించే ఏ కన్నవారూ ఇలా చేయరు.
మనం తీసుకునే జీవితబీమా.. మనం లేకపోయినా మన కుటుంబం నిశ్చింతగా బతకడానికే కాదు, మన అప్పులేవైనా ఉంటే.. తీర్చేయడానికి సరిపడా మొత్తాన్ని కవర్ చేయగలగాలి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Personal Finance Tips | కట్టిన ఇల్లు కొంటే లాభమా? కడుతున్నప్పుడే ఇంటిని బుక్ చేసుకుంటే బెటరా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

