హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాదీ కంపెనీ నాట్కో ఫార్మా..అమెరికాకు చెందిన డాష్ ఫార్మాస్యూటికల్స్‌ను కొనుగోలు చేయనుంది. 18 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.136 కోట్లు) డాష్ను కొనాలనే ప్రతిపాదనకు మంగళవారం నాట్కో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. తమ సబ్సిడరీ యూనిట్లలో ఒకదాని ద్వారా అమెరికా కంపెనీని టేకోవర్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సేంజీలకు నాట్కో తెలిపింది. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న డాష్ ఫార్మాస్యూటికల్స్ ఔషధ విక్రయాలు, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నది. 2021 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరానికి ఈ కంపెనీ 15 మిలియన్ డాలర్ల అమ్మకాల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. అమెరికాలోని తమ కస్టమర్లతో నేరుగా వ్యాపారం చేసేందుకు డాష్ టేకోవర్ ఉపకరిస్తుందని నాట్కో తెలిపింది.